తెల్ల కాగితం

“అమ్మా!!మీ కోసం ఎవరో వచ్చారు..” అంటూ బోసు కబురు మోసుకొచ్చాడు
నాకోసం ఎవరో రావడం ఏంటీ ?
అదీ ఇంత తుఫానులో……..

ఎవరై ఉంటారబ్బా…?
వయసు ఉడిగిపోయిన నాకోసం వెదుక్కుంటూ వచ్చేవారెవరు…?అనుకుంటూ వడి వడిగా బోసు వెనాకాలే నడక సాగించా.
 
ఎదురుగా ఎవరూ లేరు

3 రోజులనుంచీ ఏకధాటిగా వర్షం కురవడం తో మా ఆశ్రమం అంతా ముసురు లో ముసుగేసింది.ఎప్పుడూ ఏవో లెక్కలు రాసుకుంటూ ముందటి వరండాలో నిండుగా ఉండే సుబ్బయ్య కూడా శెలవు పెట్టాడు.

జాతీయదినోత్సవాలలో తనలో ‘మనీ’ ని పక్కన పెట్టే మనుషులే తప్ప ,మామూలురోజుల్లో పెద్ద అలికిడి ఉండదు  మా ఆశ్రమం లో.

అప్పుడప్పుడు సావిత్రమ్మ మనవడు పరీక్షలకు ముందస్తు తయారిలో భాగం గా రాసే ఉత్తరం తప్ప ,బయటి నుంచీ మాకొచ్చేవి ఏవీ లేవు.
    
“ఉండండమ్మా  ఆయన ఎక్కడికి పోయాడొ కనుక్కొస్తా”అంటూ నన్ను వరండాలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు బోసు.
ఎవరై ఉంటారబ్బా……ఇంత అర్థరాత్రి,వర్షం లో ,అదీ నా కోసం…….?

“అమ్మా!!!!” అన్న బోసు పిలుపుతో ఉల్లికిపడ్డ నా ఎదురుగా ఒక నిండు విగ్రహరూపితుడైన వ్యక్తి

ఆ కళ్ళు నాకు బాగా తెలిసిన కళ్ళు
ఆ కళ్ళు ….నా మూగ ఊసులన్ని పంచుకున్న కళ్ళు
 
నేనెక్కడైనా ఉన్నానేమొ అని ఆ కంటి లోగిలో మెల్లెగా ప్రవేశించా…. బాహ్య ప్రపంచపు గదులన్ని దాటుకుంటూ వెళ్ళా 
 
…ఆ కనిపించింది……ఏ మలినం లేనిది…..తన అందమైన శరీరమనే తాలూకు పరదాను పక్కకు తోసేసి,జీవితాన్ని తనదైన తీరులో మలచుకున్నది  
 
“ఇంకా గుర్తున్నానా మాష్టారు.?”
“పదమ్మా ఇంటికి వెళ్దాం…”
“ఎవరింటికి మాష్టారు ?”
“అమ్మా…నీ కొడుకు కలెక్టరీ పాసయ్యాడు,అక్కడికే వెళ్దాం పదమ్మా,నిన్ను తీసుకువస్తానని మాటిచ్చాను ”
“అంత ఆశలేదు మాష్టారు,ఈ కట్టె పుచ్చి పోయిందని తెలిసినా,ఇనాళ్ళు భద్రం గా దాచుకున్న ఈ ఆశ్రమం లోనే కాలనీయండి..”
 
“అంత మాట అనకమ్మా…నీ మనసు మలినం లేని మేలిమి బంగారం…ఆ పాత ఙ్ఞాపకపు ఛాయలు గుర్తుండకూడదనే కదమ్మా నీకు ‘కాంచన ‘ అని పెట్టింది ”
 
“మర్చిపోవాలన్నా మర్వనివ్వనివి మాష్టారు అవి…”

ఒక్క నిమిషం ,ఇప్పుడే వస్తాను

“ఈ వీలునామా అబ్బాయికి అందివ్వండి …”

నేను వీలు నామా రాయడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా ? 
 
ఉంది మాష్టారు నేనూ వారసత్వం గా ఇవ్వాల్సినది.మొన్న పేపరు లో చదివాను,అబ్బాయి రామాపురానికే కలెక్టరీగా వెళ్తున్నాడు అని.

ఈ కాగితం గుర్తుందా మాష్టారు ?
పాతికేళ్ళ క్రిందట మీ దగ్గర తీసుకున్నది
గుర్తున్నదా  ఆ రోజు……..

*******************************************************

“…ఏమిటే నిన్న రాత్రి వచ్చిన వాడిని పదో పరకో అడగకుండా పట్నం నుంచీ బొమ్మల పుస్తకం తెమ్మాన్నావా ?
నీకు ఈ కొత్త మాయరోగం ఎప్పుడు పుట్టిందే  ? ”

” అమ్మా….నేను సదువుకుంటానే ….”

“సదువా….అదేందే….హాయిగా ‘పడుకుని సంపాదించమంటే…..సదువుకుంటా అంటావేందే… ..?”  
ఈ కొత్త పిచ్చి పట్టుకున్నందుకా నిన్న వచ్చిన గిరాకీని బొమ్మల పుస్తకం తెమ్మన్నావ్ ….ముదనష్టపు దానా…ఈ రోజు కడుపుకి లేకుండా జేసినావ్…….”

“….శివాలయం లో గోవిందయ్య మాష్టారు అందరికీ సదువు సెప్తున్నాడట ,ఈ రాత్రికి ఆడికోతానే… ”

“అమ్మా,తల్లీ  అని నిదానం గా సెప్తుంటే మాటవినవేందే….లేచి త్వరగా నలుగు పెట్టి స్నానం సెయ్యి,రాత్రి పక్క ఊరి ఎం ఎల్ యె వస్తున్నాడు…ఎక్కువ గిట్టుబాటు అవుతుంది……”

“నేను ఎల్లనే ఆడిదగ్గరికి….”

***************************************************

శరీరం మీద ఏదో పాకుతున్న భావన,చీడపురుగే…సందేహం లేదు …
ఎదురుగా తెల్లని చొక్కా జేబులో మెరుస్తూ కనిపిస్తోంది పెన్ను…

రామాపురం మా గ్రామం.దాదాపు 20 కుటుంబాలందరికీ ఇదే కుల వృత్తి.గిట్టుబాటు అయ్యే పదో పదిహేనుకి నిత్యం నలిగి పోయేది ఎన్నో కలలుగనే శరీరాల మాటున దాగున్న మా మనసులు.
ఇదే జీవితం అని ఆనందం వెదుక్కుంటూ అంకితభావం చూపించే వారు కొందరైతే,దీనినుంచీ బయట పడాలి అని ప్రయత్నం చేసి విఫలమైన వారు కొందరు,పారిపోయి కొత్త జీవితం మొదలు పెట్టాలి అని నిత్య ఆశావాదులు ఇంకొందరు.
 
వీరందరినీ ఏదో ఒక రోజు మారుస్తా అని నడుం కట్టిన గోవిందయ్య మాష్టారు లాంటి వారు ఇంకొందరు .మాష్టారు అంటే నాకు ఏదో తెలియని అభిమానం.సుఖనారీమణుల మధ్య శుకుడి లా ఉండే మాష్టారు ఏమీ కానీ మా కోసం అంత తపన పడడం చూసినప్పుడల్లా నాలో ఏదో ఆశాజ్యోతి వెలిగేది
ఈ రొంపి నుంచీ బయటపడి నేనుగా బ్రతగలను అన్న ఆశ.

“అటేందే సూస్తున్నావ్,నన్ను సూడవే ” అన్న పిలుపుతో ఉలిక్కి పడ్డా

“తు నీ యబ్బా……..ఇదిగో నీ 20……” 

“ఈ డబ్బు బదులు ఆ పెన్ను ఇవ్వండయ్యా…….?”

“.దానికి ఇంకో మారు నాకాడికి రావాలా,వస్తావా ? ”

చేతిలో నిగనిగ లాడే కొత్త పేనా.దీనితో ఏదేదో రాసెయ్యాలి.రాసేసి,సదివేసి ఏదేదో అవ్వాలి.మాష్టారీ సదవాలి.సదివి లక్ష్మిని ఇక్కడినున్సీ తీసుకెల్లాలి.తీసుకెల్లి ఇంకా ఇంకా సదివించాలి.పాపం పిచ్చిది,మూలకూసున్న మూడవనాటి నుచే దీనిలో……

“తూ యాడ ఆలోసితున్నావే ……మనసంతా పాడుసేసినావే…నీ యమ్మ నువ్వేదో అని 100 ముందే గుంజి నాది….తు మీ బతుకు…..”  
 
నిజమే….ఇదీ ఒక బతుకేనా…..ఎందుకో తెలియని బతుకు,నాకు నేను పనికి రాని బతుకు.
ఒక నాడు  తెల్లవారు ఝామునే మాష్టారు ,తెల్లటి చొక్కా లో ,తెల్లని సుద్దముక్కతో, అంతకన్నా తెల్లనైన మనసుతో మాష్టారు వెళ్తుండడం చూసి ధైర్యం చేసి నా మనసులోని మాట చెప్పాను.తెల్ల కాగితం ఒకటి చేతికి ఇచ్చి నీకు ఎంతవరకు రాయడం వచ్చో చూపించు అన్నారు.

ఇంతకాలం బొమ్మల పుస్తకాలలోరహస్యం గా రాసుకున్న నాకు ఆ తెల్లకాగితపు స్పర్శ కొత్త ధైర్యాన్ని ఇచ్చింది
 
“ఈ నరకం నుంచీ విముక్తి పొందాలి అంటే ఏమి రాయాలి ??” అని గద్గద స్వరం తో నాకు తెలియకుండానే పలికేసాను
 

“అయితే ఈ రాత్రికే నీ ప్రయాణం,శివాలయం దగ్గర 1  కి ”
చేతిలో తెల్లని కాగితం.మొదటి సారి స్వేచ్చగా గడపడాటుతున్న ఆనందం.ఆఖరు మాట కాగితం మీద రాద్దామనుకున్నా.

” …ఎవరికి రాయాలి? జాగ్రత్త తీసుకోనందుకు ప్రతిఫలం గా 9 నెలలు నన్ను మోసిన తల్లికా?
కొత్తగా డబ్బు సంపాదించే మార్గం దొరికిందని తండ్రి అవతారం ఎత్తి,నన్ను వ్యాపారం చేసిన తండ్రికా ? ఈ కాగితపు విలువ తెలియను వాళ్ళకు రాయడం కూడా వృధా…….”  అనుకుని కాగితాన్ని జాగ్రత్తగా పెట్టెలో  దాచుకున్నా.
  
మాష్టారి సహాయం తో ఒక ఆశ్రమం లో కొత్త జీవితాన్ని ప్రారంభించాను .పచ్చని చెట్లు,కడుపునిండా భోజనం,కావలిసినన్ని పుస్తకాలు.

నా మనసుకి సంబంధం లేకుండా కలిగిన విషబీజాన్ని మాష్టారే చదివిస్తానని తీసుకెళ్ళారు.నా వంతుగా కాగితాన్ని తీసి ఏదేదో రాసి వాడి చేటిలో పెడదామని  ఆశ.

“అయినా ఏమి రాయాలి,జీవితం లో ఏమి సాధించానని రాయాలి,నా నీడ ను కాగితం రూపం లో అందించి  బంగారు భవిష్యత్తుకి చీకటి క్రీనీడను అందించను….”  అని మళ్ళీ కాగితాన్ని భద్రపరిచాను

*************************************

“వీలునామా అని తెల్ల కాగితం ఇస్తున్నానేమిటి అని చూస్తున్నారా మాష్టారు? ”

ఈ కాగితానికి నా జీవితంలోని ప్రతి మలుపు తెలుసు మాష్టారు,తెల్లగా కనిపించినా ఎన్నో వర్ణాల ఊసులని మూగగా తనలో లీనం చేసుకున్నది.నా చీకటి జీవితాన్ని రహస్యం గా తనలో పొదిగిపెట్టుకున్నది. 

నా కోరిక ఒకటే మాష్టారు..ఆ రామాపురం లో అందమైన జీవితపు ఇంద్రధనస్సు చూడని బ్రతుకులెన్నో.వారి కోసం తనవంతుగా ఏదైనా చేసి,నా లాంటి తెల్ల కాగితాల మీద అందమైన బొమ్మను వెయ్యమనే …..

నా జీవితానికి ఇన్నాళ్ళకు సార్ధకత వచ్చింది అని తృప్తి గా నవ్వుతూ మాష్టారి జేబులోంచి వీడుకోలు చెప్తోంది “తెల్ల కాగితం ”  
 
   
 
 
   
 
 
 
 
  
 
  
 

Published in: on మార్చి 15, 2008 at 12:10 ఉద.  15 వ్యాఖ్యలు  

చిన్నారి దేవుళ్ళు…..

“కలడందురు దీనుల ఎడ,కలడందురు పరమయోగి గణములపాలన్,కలడందురు అన్ని దిశల,కలడు కలండను వాడు కలడో,లేడో……..”

ఈ ధర్మ సందేహం అందరికీ వస్తుందేమో!!

దీనుల దగ్గర ఉన్నడా…మరి దేశం లో ఎంతో మంది ఉన్నారు…..మరి వారి దగ్గర ఉన్నడా?

మంచి వారి సమూహం లో ఉన్నాడట…..నిజం గా ఉన్నడా….? ఏమో ఉన్నాడేమో…….అయినా మనసుమూల ఏదో అనుమానం…  !!

“ధైర్యము విలోలంబయ్యె ,మూర్ఛవచ్చె,తనువుండస్సె శ్రమంబయ్యెడిన్,రావే ఈశ్వర,కావవే వరద సమ్రక్షించు భద్రాత్మకా…….” ఇలా ప్రతి రోజు ఎంతో మంది ఆర్తులు పిలుస్తూనే ఉన్నారు…..

మరి వారికి నిజం గా కనిపించాడా…. ?? 

మంచి జరిగితే నా ప్రతిభే అనీ,చేడు జరిగితే “విధి ఆడే వింత నాటకం…కర్త ఎవరూ,కర్మ ఎవరూ అని  ఒక అతీత శక్తి మీద తోసేస్తాం…..”

కొందరి వాదన ప్రకారం భగవంతుడు అన్న సిద్ధాంతం మానసిక బల్లాన్ని ఇవ్వడానికి ఏర్పరచుకున్నది. నిజమేనేమో…..   అయితే ఈ చిన్నారి దేవుళ్ళను మనసారా సేవిద్దాం ***************************************************************

రోజూ వీటిని స్తోత్రాలతో ధ్యానించమని అడగవు.

తమ గుణగణాల మీద కావ్యాలు రాయమనీ అడగవు.

వేల వేల కృతులు వీటి మీద ఎవరూ రాయలేదు(బహుసా ప్రేమ పొంగినప్పుడు ..ఒకటో అరో తమ మనసు మీద రాసుకున్నారేమో… )

ఇంకో జన్మ నీకిస్తా,ఇంకా నా మీద రాయవా అని ఆశచూపించవూ.. మాకు గుడి కట్టించమని ఎవ్వరి  కలలోనూ చెప్పవు.

ఫలానా రోజు మాకు కళ్యాణం చేయ్యమనీ,నాకోసం ఒక రాత్రి జాగరణం చెయ్యమనీ అడగవు..   

అష్టోత్తరాలు,సహస్త్రనామలు వీటికి లేవు..

“ఫలం,పుష్పం,పత్రం,తోయం… “ఇలాంటి వి కూడా కనీసం ఇవి కోరవు. ”

శ్రవణం,కీర్తనం,స్మరణం,పాద సేవనం,అర్చనం , వందనం,దాస్యం,సఖ్యం,ఆత్మ నివేదనం “అంటూ తమని కొలిచే మార్గలనూ చూపించవు.

వీటి పెళ్ళిళ్ళకూ,పుట్టిన రోజులకూ,ఎవరినో ఓడించినందుకు ఏ శెలవులు లేవు…

అయినా ఇవంటే మనకు  అభిమానం

వాటిని చూడగానే తెలియని ఆనందం

రూపాయ్యల లెక్క ప్రకారం తక్కువే అయినా,ఇవి ఇచ్చే మానసిక స్థైర్యానికి మనం  విలువ కట్టలేము…  

వెన్ను తడుతూ నిత్యం మనల్ని ప్రోత్సహించే స్పూర్తి ప్రధాతలు.

“నేనున్నా నీకెందుకు,నా మీద భారం వెయ్యి “అని నిత్యం గీతోపదేశం  చేసే  ఆత్మీయులు,మన ఆత్మలో ఏకం అయిన వారు.

ఎక్కడో మన పర్సు మూలలో దాక్కున పాత రూపాయి బిళ్ళ,

రాములోరి కళ్యాణపు అక్షింతలు,ప్రతి పరీక్షలోను మంచి మార్కులు తెచ్చిచ్చే పాత పెన్ను(బోలెడు ప్లాస్టర్లు అతికించినది),

పరీక్షలప్పుడు కచ్చితం గా  విషస్ చెప్పే పక్కింటి వాణీ ఆంటీ,

మనకు ఎదురోచ్చి తన వంతు దీవెననిచ్చే ఎదురింటి కుక్క పిల్లా,

మన పుస్తకాల్లో ఉండే నెమలి ఈక(పిల్లలు పెడుతుంది అన్న ఆశతో నిత్యం మనల్ని బ్రతికించేది),దానికి జతగా సరస్వతీ ఆకు,వాటికి ఆహారం గా అబ్రకం …..గట్రా. 

వీటన్నిటినీ మించింది నా జీవితం లో ఒకటి ఉంది.    

ఏ డ్రస్సు కుట్టినా వంక పెట్టకుండా తొడుక్కునేది  

శస్త్ర చికిత్స(ఆపరేషన్) పేరుతో ఇంజెక్షను పోట్లు పడ్డది.

మట్టి,ఆకులతో చేసిన వంటలను ఏ వంకా పెట్టకుండా తినేది.

ఎన్ని సార్లు పెళ్ళి,ఎలా చేసినా మారాం చెయ్యలేదు. టీచరు గా ఎన్నో సార్లు కొట్టాను..(మా టీచరు మీద కసి ని తీర్చుకునే దాన్ని)..అయినా ఏమీ అనలేదు.  

“పాపం వస్తుంది,కళ్ళు పోతాయి” అని ఏ నాడు భయపెట్టలేదు.

అదే నా చిన్నప్పటి  బొమ్మ(అక్కి), దానికి చెలికాడు బాలు.

కాలాం తీసుకు వచ్చే పెను మార్పుల్లో మొదటిగా చెప్పేది..మన వయసు పెరగడం…ఈ మార్పునే నేను గాయం అంటాను

ఈ గాయానికి నేనూ అతీతురాలిని కాలేక పోయాను.
నా చిన్నారి దేవుళ్ళటో మనసారా మాట్లాడి ఎన్నాళ్ళు అయ్యిందో?

వీటికి తలారా స్నానం చెయ్యించి,కొత్త బట్ట కట్టి ఎన్నాళ్ళు అయ్యిందో?

అయినా నా నుంచీ ఎదీ ఆశించని మహోన్నతులు .
ప్రతి నిత్యం అల్లంత దూరం నుంచి నన్ను ఆశీర్వదించే దేవదేవుళ్ళు .

నన్ను నన్ను గా అర్ధం చేసుకున్న మహాను భావులు…… నా చిన్నరి దేవుళ్ళు……    

Published in: on జూలై 27, 2007 at 8:51 ఉద.  3 వ్యాఖ్యలు  

అందమైన మా ఇల్లా …..ఇదిగో

మా ఇల్లా…రండి చెప్తా…కాదు కాదు చూపిస్తా

అందమైన మా ఊరిలో మరింత అందంగా ఉంటుంది మా ఇల్లు

అదేదొ సినిమాలో చెప్తారే”మేడంటే మేడా కాదుగూడంటే గూడూ కాదుపదిలంగా అల్లూ కున్నా పొదరిల్లూ మాదీపొదరిల్లూ మాదీ”అచ్చు అలాగే ఉంటుంది మా ఇల్లు

చక్కగా మా ఊరి స్టెషను లో దిగి నడక సాగించాలి

అలా దారిలొ పెద్ద ధర్మాసుపత్రిదానికి ఎదురుగా అమ్మల గన్న యమ్మ గుడిఅన్నీ దాటాక వస్తుంది మా ఇల్లు

మా ఇంటి గడప ఎక్కగానేపరిగెత్తు కుంటూ వచ్చి ముద్దు పెట్టే మా “టుట్టు”గాడుమరి నాకు ముద్దు పెట్టవా అంటూ ఆశ గా చూసే వాడి చెల్లిఅలా వీళ్ళ తొ సహా లొపలికి వెళ్ళ్లగానే మా గుమ్మం ముందు , ఆంజనేయస్వామి విగ్రహం రా రమ్మంటూ ఆశీర్వదిస్తుంది

అలా అలా లోపలికి అడుగు వెశాకమొదట దర్శన మిచ్చే మా ఇంటి వరండా

అక్కడ ఎత్తుగా ఉండె గట్టు

ఆ గట్టు మీద నాన్న లెక్కలు చెబుతూ,కింద నేను కూర్చున్న నీడ జ్ఞాపకం

తరువాత మా పెద్ద హాలుఆ….అక్కడే నేను త్తప్పటడుగులు వేసింది

ఆ గోడలే నాకు నడక నెర్పించిందిఆ నేలలలె నాకు అక్షరాలు దిద్దించింది

ఆ హాలు లో ఎప్పుడూ అభయ హస్తం ఇచ్చె మా కళ్యాన వెంకన్నపక్కనే ఠీవిగా నిలబడే మా కృష్ణయ్య (రాధ లేదాయె!!)దాని పక్కనే హద్దు చెప్పే మా వేదాద్రి నర్సన్న

అటు వైపు తిరుగుతే మా పడక గది

బూచొడా??

ఎప్పుడూ ఉండడమ్మా………మనం నిద్రపోకపోతే అప్పుడు వస్తాడు

ఏమీ భయపడక్కరలేదు లే

అక్కడె గా అమ్మ నాకు జోలపాటలు పాడిందీ ,కధలు చెప్పిందీవినిపిస్తున్నాయా???

అలా పక్కకొస్తే మా వంట గది

అదేగా నాకు గొరుముద్దలు తినిపించింది ,చందమామను చూపించిందీ

అక్కడ నుంచి బయటకు వస్తే మా చక్కటి పెరడు

అల్లన పాకిపొతొందే అదే మా జాజి చెట్టు ………ఆ పూలు ప్రతి సారి నా పూల జడలో భాగమేగా!!

పక్కనె కుంపట్లొ కనిపించేది మరువం,ధవనం,కనకాంబరం

ఇక మా పళ్ళ్ల చెట్లకు వస్తే …..మా సీతాఫల చెట్టు, పక్కనె పప్పాయి ….ఆ పక్కనే జామ చెట్టు

అలా ఇంకా ముందుకు వెళితే నా చెతిలో ఎప్పుడూ పూసె మా గొరింట,,,,,దాని పక్కనే ఎప్పుడూ మెరిసి పొయే మా తులసి చెట్టు

భలే ఉంది కదా మా ఇల్లు

కానీ ఎమైందొ తెలుసా…ఇంత అందమైన ఇంటినివదులు కున్నాను

ఊ..నిజంగా!!!

ఆ విషయం తెలిసిన రాత్రి నిద్ర లేదు

ఆ ఇంటికి నేనేమిటో తెలుసు

నా కష్టం ,సుఖం,గెలుపు ఓటమి ..ఎన్నో చూసింది

అన్నిట్లొనూ మౌనం గానె ఒదార్చేది. మూగగా నాతో పాటు ఎడ్చేది,నవ్వేది ..,అన్ని నాతో పాటూ చేసెది,చూసేది…ఎన్నో భరించింది

నా రహస్యాలు దాచుకుంది

నా ఆనందం దానికి తెలుసు

నా స్నేహితులు దానికి తెలుసు

నా వాళ్ళు అంతా దానికి తెలుసు.ఇక ఆ ఇంట్లొ ఉండె అవకాశం నాకు మళ్ళీ రాదు.వచ్చినా ఆ మధురమైన ఘఢియలు రావు

ఆ ఇంట్లొ ఎవరో వస్తారుఎవరొ ఇంక ఎవరెవరొ వస్తారు

నా లాగే వెళ్ళిపొతారు .కొత్త వాళ్ళతో ఎలా సర్దుకు పోతుందో ఆ ఇల్లు

దానికి ఎమీ తెలియదు. అన్నిటినీ మౌనం గానె భరిస్తుంది.కొత్త వాళ్ళు దానిని ఎలా చూసుకుంటారొ ఎమో

ఏంటో ఈ బంధాలు??

ఏంటో ఈ భాంధవ్యాలు??

మట్టి గోడలతో కూడా ఎన్ని ఊసులో కదా!!!

ఎక్కడి బంధమో ఇది

ఎన్ని జన్మల సంబంధాలో ఇవి…మూగ మనసులు అంటే ఇదేనేమో?

కన్నీరు ఆగదు ఆ ఇంటి గురించి తలచుకుంటే

అదే నా ఇల్లు

ఇప్పటికీ ఎప్పటికీ

ఎన్ని భవంతుల మేడ లు ఎక్కినా

ఎన్ని అంతస్థుల మిద్దెలు కట్టినా

గేహం వదల డానికే ఇంత బాధ

మరి ఈ దేహం వదిలేటప్పుదు..???

జీవితం నిజం గా రైలు ప్రయాణం లాంటిదా??

ఏంటి ఈ వేదాంతం??

ఆఖరికి అదే నా ఓదారుపేమో

Published in: on జూన్ 14, 2007 at 5:59 ఉద.  2 వ్యాఖ్యలు  

తప్పెవరిది…తప్పెవరిది ???

It takes a second to have a crush on someone,
an hour to like someone,
a day to love someone,
but a life time to forget someone”

తప్పెవరిది…తప్పెవరిది
దెనికి చలించనని మురిసి పొయె గత కలపు నాదా??తొలి చూపులొనె నీకు వశమైన నీ చూపులదా??
తప్పెవరిది??
ఫ్రతి నవ్వులొ నిన్ను చూసుకున్న నా పెదవులదా?నీ రెప్పపాటు చూపుకే కందిపొయినా నా చెక్కిళ్ళదా?నీతొ రహస్యం అడుగులు వెసినా నా అడుగులదా?
తప్పెవరిది?
నీ తలపులతొ జూగిన నా రాత్రులదా?నా కలలొ నిన్ను చూపించిన నా కను పాపలదా?నీకై నే రాసుకున్న నా మనొలేఖలదా?ఫ్రతి రాగం లో మనల్ని చూపించినా ఆ యుగళగీతాలదా?వాటి భావాలదా?మన ఊసులన్ని పలికించిన ఆ గువ్వల జంటదా?
తప్పెవరిది??
మరొకరి సొంతం అని తెలిసినా ఆశీర్వదించని నా సంస్కారానిదా?నాకే సొంతం అన్న భరొసాతొ ఉన్న నా నిన్నదా??నీకు ఎమీ చెప్పలేని నాదా??
తప్పెవరిది??ఎడతెరపిలెని నా కన్నీళ్ళదా?గుణపాఠాల ఘ్నాపకం గా దాచుకొలేని నా బుగ్గలదా?డస్సిపోక అడ్డుచెప్పలేని నా చెతులదా?
ఇంత జరిగినా ఇంకా నిన్నే కొరుకునే నా పిచ్చి మనసుదా??
తప్పెవరిది ..తప్పెవది???

“Love starts with a smile,continues with a kiss and ends with a tear drop

Published in: on జూన్ 14, 2007 at 5:57 ఉద.  Comments (1)  

జెట్టర్ పెన్

“సావిత్రీ!!ఎన్ని సార్లు చెప్పాలి,ఆఫీసుకు మాటి మాటికీ ఫోను చెయ్యద్దని….”
అమ్మా… నేను… నేను… అంటూ ఫోను అందుకోవడం మా వాడు చేసే ప్రయత్నాలు చక్కగా వినిపిస్తున్నాయి.
“ఈ రోజే ఆఖరు లేండి.రేపటి నుంచీ ఎటూ స్కూళ్ళు “అంటూ మా వాడికి ఫోను అందించిందీ.
“నాన్నా పొద్దున ఎక్కడికి వెళ్ళావ్,నేను లేచినప్పుడు లేవు…”
. ఈ ప్రశ్న కు ఏమని చెప్తే ఆ చిన్న మనసు సమాధానపడుతుంది.
“కన్నా..నీకు కొత్త పుస్తాకాలు తెచ్చా,చూసుకున్నావా…”
“నానా..పెన్ను తీసుకురాలేదే,నిన్న తెస్తానని అన్నావ్”అంటూ సూటిగా విషయానికి వచ్చాడు.
“ఈ రోజు తప్పకుండా తెస్తా కన్నా…”అంటూ ఫోను పెట్టేసా.
దూరం ఊగుతున్న క్యాలెండరు మీద నా దృష్టి పారింది.
జూన్ 12: దాదాపు అటూ ఇటు గా స్కూళ్ళు తెరిచే రోజు..కొన్ని రోజులుపాటూ నేస్తాలతో ఏర్పడిన విరహం తీరబోతున్న రోజు.శెలవల్లో చేసిన పనులన్నీ రాశులుగా చెప్పే రోజు.ఇలాంటి ఎన్నో జూన్ 12లు గడిచినా, రెండు దశాబ్దాల నాటి జూన్ 12 కు మాత్రం నా జీవితం లో ప్రత్యేకత ఉంది.

*************************************************************************************************
త్వరగా లేరా……” అన్న అమ్మ కేక తో ఉల్లిక్కిపడి లేచాను.
ఈ రోజు నుంచీ స్కూలు మొదలు.
కొత్త డ్రస్సు,కొత్త పుస్తకాలు.తలచుకుంటుంటేనే ఎలానో ఉంది.గబ గబా తయారు అవ్వాలి. పైగా ఈ రోజు మా ప్రోగెస్సు కార్డు కూడా ఇస్తారు.అదీ మా స్కూల్లో అందరిముందూ,మా హెడ్డు మిస్సు చేతుల మీదుగా.
ఆయినా చిన్న బాధ.ఈ సారి వంశీ గాడు,ఏం చెసాడొ,ఎలా చదివడో గనీ నాతో పాటు 1స్త్ రాంక్ కొట్టేశాడు.ఒక్క మార్కు తక్కువరాకూడదు.వాడి తస్సదియ్య!!

నా చప్పట్లలలొ సగం వాడివి.ప్రతి టీచరు దగ్గర నాక్కున్న పేరు లో సగం వాడిది.
దేవుడా!! కరెంటు కోత అంటారు.పరీక్షలప్పుడు వాళ్ళ వీధిలొ తీయకూడదా.ఇక వాడి బడాయి చూడతరమా ఇక,నన్ను నా గాంగ్ ను వాడు ఎలా చూస్తాడొ??

స్కూల్ కు రాగానె అస్సెంబ్లీ లొ మా ఇద్దరినీ పిలిచ్చి ప్రొగ్రెస్సు కార్డ్ ఇచ్చారు.వాడి పక్కన నుంచోవాలంటేనె ఎలానో ఉంది.ఎవరికీ కనిపించకుండా వాడిని పక్కకుతొశా.వాడు అంతే ఉత్సాహం తో నన్ను తోశాడు.ఈ తొపులాట అనంతరం,చప్పట్ల మధ్య కొత్త క్లాసు లొ అడుగుపెట్టాం.

కొత్త బాగ్,కొత్త బుక్స్,కొత్త కంపస్స్ బాక్స్,అన్నీ కొత్తవె.కానీ…ఒక్కటే వెలితి…… పెన్ను.పెన్సిల్ తో రాయడం ఈ సంవత్సరం కూడ తప్పదురా దెవుడా అంటూ రాయడం మొదలుపెట్టా

ఏమైందొ ఏమో..పోయిన క్లాస్స్ నా పక్కన కూర్చున్న వాసు గాడు వంశీ గాడి పక్కన చెరాడు.వాడు ఉంటె అప్పుడప్పు టీచరు చెప్పిన ఇంపార్టంట్ ప్రశ్నలు స్టార్ మార్క్కు పెట్టడానికి పెన్ను ఇచ్చేవాడు.ఇక ఆ పని కూడా పెన్సిల్ తొనే చెయ్యాలి

మెల్లెగా నా కంచుకోట కదులుతోంది.నాతో పాటు తిరిగిన వాళ్ళు మెల్లెగా వంశీ జట్టు కట్టేస్తున్నారు.ఇంగ్లీషు నోటూ బుక్కు లొ బెస్ట్ ఫ్రెండు గా నీ పేరు రాస్తా అని ఆశ చూపినా ఎవరు రావట్లేదు.ఏంటీ కారణం అని మెల్లెగా ఆరతీస్తే అప్పుడు అర్ధం అయ్యింది.వంశి గాడు అదెదో “జెట్టర్ పెన్ను “ అట ,మా నాన్న ఇచ్చాడు అంటూ క్లాసు కు తెచ్చాదు.అడిగితే పేరు రాసుకొనిస్తున్నాడు అట.తస్సగొయ్యా !! ఇదా అసలు సంగతి.

మా నాన్న జేబులో ఉన్న ఫౌంటైన్ పెన్ను కన్నా నా.వీళ్ళకేమి తెలుసు ఫౌంటైన్ పెన్ అంటే.ఎవడో ఏదో జెట్టర్ పెన్ అంటే ,వాడి వెనక పడ్డారు వెర్రి గొర్రెలు!!!

ఇక నేను ఆ ఫౌంటైన్ పెన్ను తెచ్చానంటేనా…..టీచరు కూడా నన్నే చాకు పీసు తీసుకు రమ్మని ,నన్నే మట్లాడె వాళ్ళ పేర్లు బోర్డు మీద రాయమని చెప్పల్సిందే.

ఆ ఫౌంటైన్ పెన్ను ముందు ఈ వెధవ జెట్టర్ పెన్ను ఎంత.దాని పాళీ అంత ఖరీడు చెయ్యదునేను ఇంత కాలం దాని మీద దృష్టిపెట్టి అడగలేదు కాని,లేక పొతే నాన్న అడగంగానే నాకు ఇవ్వరాఈ ఆలొచనల్తోనే..నా మొదటి రోజు ముగిసింది.

ఇంటికి రాగనే అందరికీ నా ప్రోగ్రెస్సు కార్డ్ చూపించా.నాన్న కొసం కొత్త పుస్తకాలు ముందు వేసుకొని ఎదురుచూస్తున్న

నాన్న వచ్చీ రాగనే నా ప్రోగ్రెస్సు కార్డ్ చూపించా.ప్రతి సారి “ఏమైనా కొనుక్కొ” అంటు నాలుగు రూపాయలు పెట్టే నాన్న ఈ సారి మాత్రం ఎమీ మాట్లాడ లేదు.

ఏమోలే ఆఫీసు లో ఎమైనా గొడవలేమొ.రెప్పొద్దున నేనే అడిగెస్తా ఒక్క సారి మీ పెన్ను స్కూల్ కు తీసుకెళతా అని.

తెల్లారింది.నేను అదుగుదామని వెళ్ళే లోపే,సాయంత్రం లేటు గా వస్తా,నా కోసం ఎదురు చూడకుండా భొజనం చేసి పడుకోండి అర్గెంటు పని ఉంది అంటూ వెళ్ళి పొయారు.

ఈ రోజు కాక పొతే రేపు అడుగుతాలే అంటూ స్కూల్ కు సిద్ధం అయ్యా.మెల్లెగా అమ్మ చెవిలో నాకు పెన్ను కావాలి అన్న సంగతి చెప్పేశా“ఒరేయి! పెన్సిల్ తో రాస్తేనే రాత కుదురుతుంది రా.అప్పుడే నీకు పెన్ను ఎందుకు.మా అప్పుడు కాలేజి లో చది వే వాళ్ళు తప్ప పెన్ను ఉపయొగించే వాళ్ళు కాదు.ఎటూ వచ్చే ఏడు హై స్కూల్ కు వస్తావ్ గా అప్పుడు కొనిపెడతాలే” అంది

“అది కాదమ్మా!!వంశీ గాడు పెన్ను తెచ్చి నా దోస్తులందరినీ తన వైపు తిప్పుకుంటున్నాడు” అన్నా వినకుండ నన్ను స్కూల్ కు తోసేసింది

ఇక లాభం లేదు.రాత్రి బామ్మ కు చెప్పాల్సిందె.పద్యం అప్ప చెప్ప గానే ముద్దు పెట్టేటప్పుడు అడుగుతా.కాదనదు.

మళ్ళీ క్లాస్స్ లొ అదె గోల.అంతా ఆ వంశి గాడి పెన్ను గురించే మట్లాడుతున్నారు.ఒక రోజంతా వాడితో తిరిగెవాళ్ళకు పూర్తి ప్రశ్న రాసుకోవడానికి ఆ పెన్ను ఇస్తున్నాడు అట.చెత్తగా రాసే వాడి రాత కూడ ఆ పెన్ను తో రాస్తే భలే ఉంటుంది అట.ఇంకా ఏంటెంటొ చెప్ప్తున్నారు.అదీ నాకు వినపడేలాగా…

ఏ మాటకు ఆ మాట చెప్పాలి.ఈ జెట్టర్ పెన్ను కూడా బాగనే ఉంది.నాన్న పెన్ను లాగా సిరా కారదట.అప్పుడే నలుగు పెట్టి స్నానం చేసినట్టు,చక్కగా నునుపు దేరి ఉంటుంది .

బామ్మ పాడుతూ చెప్పే రాముల వారి రంగు.ఆకశం రంగులొ ఉన్న రాముడు ఎం బాగుంటాడు అనుకునే నాకు అప్పుడు కాని అర్ధం కాలేదు రాముడి అందం.అబ్బా…..ఎందుకు నా ఈ జామ పండు రంగు.చక్కగా నీలి రంగులొ నిగ నిగ లాడొచ్చు అని అనుకున్నా.

ఇక దీని చిన్ని కాపు చూడాలి,అచ్చు వజ్రాల కిరీటం లాగా ఉంది.వెండి మొలతాడు కట్టినట్టు ఉన్న నడుము.ఇంకా కిందికి దిగితే ఇక దీని పాళీ…అచ్చు ఉలి లాగా ఉంది.దీని తో చెక్కితే అక్షరాలు కూడ ఎల్లొరా శిల్పాలు అవ్వవా…..?

రాత్రి మెల్లగా బామ్మ పక్కన చేరా.ఎలాగో కష్టపడి “ఎవ్వని చే జనించు” పద్యం అప్పచెప్పేసి,కాళ్ళు ఆమె మీద వెసి మెల్లెగా నా పెన్ను సంగతి చెప్ప.”పెన్ను కేమి భాగ్యం రా పిచ్చీ తండ్రీ!!మీ తాతయ్య ఉంటేనా….ఆ వైభోగం అంతా అప్పుడే నాయనా…అంతా ఆయనతోనే పోయింది…..మహరాజు..ఏ లోకాన ఉన్నాడొ…..” అంటు కళ్ళు అద్దుకుంది.ఇది ఇప్పట్లొ ముగిసే లాగా లేదు అని గట్టి గా కళ్ళు మూసుకొని పడుకున్నా.

తెల్లరి మెల్లెగా నాన్నను పెన్ను విషయమై కదిపా…” పెన్సిలు సరిగ్గ పట్టుకోవడం రాని చితక వెధవ్వి…అప్పుడే పెన్నా….” అంటూ వెళ్ళి పోయారు.

మెల్లెగా నాలొ కసి పెరిగింది.ఎలగైనా వంశి గాడికి తాత లాంటి పెన్ను తెచుకోవాలి అన్న తపన హెచ్చింది.దెవుడి ప్రార్ధనలొ జీళ్ళు,గోళీలు,రబ్బరు ఉన్న పెన్సిల్ ను వెనకకు తోస్తూ ఈ జెట్టర్ పెన్ను ముందుకు వచ్చింది.ఆ పెన్ను ముందు అంతా త్రుణ ప్రాయం గా కనిపించారు.పెన్ను సంపాదించలేని నా ఈ బ్రతుకు ఎందుకు అనిపించింది.రాత్రీ పగలూ ఆ పెన్ను గురించే ధ్యాస.కలలో కూడా పెన్నే కనిపిస్తోంది.

ఎలా పెన్ను సంపాదించడం…..కొనాలి ….అంటె….అమ్మను అడిగితే “ఈ సారి బోనస్ కు చూద్దం” అంటుంది

అమ్మో అప్పటి వరకూ ఆగితే…నా స్థితేం గాను.ఇప్పటికే క్లాస్సు లో సగం మంది కి పైగా వంశీ జట్టు కట్టరు.బొనస్ వచెటప్పటికి పూర్తి క్లాస్సు అంతా వాడి పక్షాన చేరి,నా క్లస్సు లీడరు పదవికి ఎసరు పెడతారు.

కొట్టెస్తే???? అమ్మో టీచరుకు తెలిస్తే చావ బాదుతుందివాడినే అడిగితే???అమ్మో నా పరువేం గాను

ఇక ఎలా…..చట్టుక్కున తట్టింది..…..మెల్లెగా వాడి తో నేను దోస్తీ కట్టి,వాడి పెన్ను తీసుకోని,శివధన్నుసుని ఎక్కుపెట్టి విరిచినట్టు విరిచేస్తా..అప్పుడు గాని వాడి పొగరు పోదు.

లేక పొతే…. నాకు పెన్ను చూపిస్తూ రాస్తాడ,టీచర్కు కూడా ఆ పెన్ను ఇస్తాడా……???ఇదె నా తక్షణ కర్తవ్యం అంటూ..ఒక ఆదివరం వాడి ఇంటికి ,క్రికెట్టు ఆడుకుందమా అని బయలుదెరా.

శెలవు రోజు కావడం తో వంశీ వాళ్ళ నాన్నగారు ఇంట్లొనే ఉన్నారు.”ఈయనే కదా వాడి బడాయికి కారణం.మా నాన్న లాగా వచే ఏడు కొనకూడదా వాడికి పెన్నువీడి బాడాయి చూడండి ”

స్కూల్ లేని రోజు కూడా జేబులొ పెన్ను పెట్టుకోని ఇల్లంతా నా ముందు తిరుగుతాడా…

ఒక్క సారి క్లాస్స్ 1స్ట్ రాగనే ఇలా పెన్నులూ గిన్నులూ కొనేయ్యడమేనా..?అదేదో పెద్ద పెన్సిల్ లో,వెనక రబ్బర్ ఉన్నది కొనచ్చు కదా…?

పెన్ను కొన్నారు పో..అలా స్కూల్ కు ఇవ్వడమేనా…?

ఇచ్చారు పో…ఎవరూ చూడకుండా నువ్వు ఒక్కడివే రాసుకో అని చెప్పకూడదా….??

ఎవరైనా చూసి అడిగారు పో…మా ఇంట్లొ ఇవ్వొద్దు అన్నారు అని వీడు చెప్పకూడదా…??

బామ్మ అన్నట్టు “ఇప్పటి నుంచీ పిల్లకు ఇలా సుఖలని అలవాటు చెయొచ్చా..?? పిల్లల్ని ఇలాగెనా పెంచడం…?

ఒక్క సారి ఆ పెన్ను నా చెతిలోకి వస్తేనా..సూర్ప్పణక ముక్కు చెవులు కోసినట్టు ఆ పెన్ను ను సగం కొసెద్దును, క్లాస్స్ అంతా మళ్ళి నా చుట్టే చేరరా.నా పక్కన కూర్చొడానికి పొటీ పడరా..?? ” అని గట్టిగా కళ్ళు మూసుకొని అడిగేసి ,వెనక్కి తిరిగి చూడకుండా పారిపొదాం అనుకున్నా.

అంతలో వంశి వాళ్ళ అమ్మ ప్లేటు లో బిస్కుత్తులు పెట్టుకొని నా దగ్గరికి వచ్చి “నీకు, మా అబ్బాయికి ఇద్దరికి 1స్ట్ రాంక్ వచ్చిందట కదా.అది తెలిసే అంకులు నీకు ఒక పెన్ను కొన్నారు.ఈ సాయంత్రం మీ ఇంటికి వచ్చి నీకు ఇచ్చేద్దాం అనుకున్నాం.అంత లో నువ్వే వచ్చావ్.” అంటూ ఒక పెన్ను నా చేతిలొ పెట్టింది.

క్షణకాలం పాటూ ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు..
******************************************************************************
ఙ్ఞాపకాల దోంతరల్లో ప్రపంచాన్ని మరచి జోగుతున్న నేను ఫోను మోతతో ఉల్లిక్కి పడి లేచా.
“నాన్నా..పెన్ను కొన్నవా?”అంటూ మా వాడి ఫోను.
శెలవుపెట్టి మరీ పెన్నులు కొనడానికి బయలుదేరా.ఒకటి మావాడికి,ఒకటి నా వంశీ కి, ఇద్దరి కళ్ళల్లో కనిపించే ఆనందాన్ని ఆశ్వాదిస్తూ….

Published in: on జూన్ 14, 2007 at 5:49 ఉద.  Comments (1)