శ్రమ ఏవ జయతే

అప్పుడే తెల్లారింది.
 
రాత్రి భోజనం చెయ్యలేదేమో సాహెబ్ మొహం బాగా అలసి పోయింది
రాత్రి పెద్ద యుద్ధమే జరిగింది మా చిన్న సాహెబ్ తో

నా వల్ల రాబడి తగ్గింది కాబట్టి అమ్మెయ్యమంటాడు చిన్న సాహెబ్.
నాకు జీవితానిచ్చిన అమ్మని అమ్మలేనని అంటాడు బాషా సాహెబ్
దీన్ని వారసత్వం గా తీసుకోలేనంటాడు చిన్న సాహెబ్.దీనితో తన కొత్త జీవితాన్ని ప్రారంభించనంటాడు.

బాషా సాహెబ్ మాత్రం కొంత కాలం అనుభవం గడిస్తే తప్ప తన సంస్థను అప్పజెప్పనంటాడు.  

ఇలా రాత్రి చాలా వేడిగానే సాగింది వాళ్ళిద్దరి మాట తీరు.ఇది చాలా రోజుల నుంచీ సాగుతున్నదే.నిన్న రాత్రి పరాకాష్టకి చేరుకున్నట్టుంది. 
నాకెప్పుడు నిద్ర పట్టిందో తెలియదు,తెల్లారి చూస్తే నా వడిలో బాషా సాహెబ్ నిద్రపోతున్నాడు
నేను తనకు జీవితాన్ని ఇచ్చిన మాట సంగతేమిటో కానీ,బాషా సాహెబ్ రాక మాత్రం నాకు జీవితం లో ఎన్నో కోణాలని చూపించింది.వెయ్యి ఏళ్ళకు సరిపడా జీవితానుభవం నేర్పించింది
 
అన్నింటికీ మించి ప్రేమిచడం నేర్పింది,ప్రేమించబడడం లో ఆనందాన్ని తెలియచెప్పింది.
జీవితపు తీపిని చూపించింది కష్టపడి పని చేయగా కలిగిన విజయం లో ఆ తీపి లో రెట్టింపు  మాధుర్యాన్ని అనుభవింపచేసింది.
 ఈ తత్వం ఎలాంటి ఉన్నత శిఖరాలకు తీసుకేళుతుందో ప్రత్యక్షం గా నాకు చూపించింది.అందులో నన్ను భాగస్వామ్యురాలిని చేసింది  
****************************
దాదాపు పాతికేళ్ళ కిందటి మాట
మూడు కాళ్ళా ముద్దుగుమ్మగా ఎంతో మంది మేధావుల సృష్టిని నేను

ఊహ తెలిసింది మాత్రం ఖాన్ సాహెబ్ దగ్గరే
పొద్దునే స్నానం చెయ్యించేవాడు ఖాన్ సాహెబ్ 
ప్రతి శుక్రవారం మసీదు లో నాకు ప్రత్యేక ధూపం వెయ్యించే వాడు
ప్రతి రోజు రాజేంద్ర నగరు నుంచీ మెహదీపట్నం వరకు మా ఇద్దరి ప్రయాణం.దాదాపు ముప్పావు గంట సేపు.

ఖాన్ సాహెబ్ మనసు నాకు మెల్లెగా అర్ధమవుతున్న తరుణం లో ఖాన్ సాహెబ్ కి తీవ్ర అనారోగ్యం వచ్చింది
తనలాగే చూసుకునే వాళ్ళకోసం తీవ్రం గా అన్వేషణ మొదలు పెట్టాడు.

ఒక డ్రైవరు గా కన్నా ఖాన్ సాహెబ్ నాకు ఒక వ్యక్తిగా ఎక్కువ ఇష్టం
చేసే పని పట్ల నిజాయితీ,నిబద్ధత ప్రతి క్షణం కనిపించేది.

అదే తత్వం నన్ను చాలా కాలం ఎవరికీ అమ్మనివ్వకుండా ఆపింది.వచ్చే గిరాకీల్లో ఏదో ప్రత్యేకమైనది చూసేవాడు.ఏదో అసంతృప్తి తో బేరం వదులుకునే వాడు

సంక్రాంతి పండుగ రోజులవి.ఆ రోజు ఖాన్ సాహెబ్, నేను రాజేంద్ర నగర్ లో మా దినచర్య మొదలు పెట్టాము.

ప్రతి రోజూ మొదటి బోణీ చేసే పోచమ్మ ఆ రోజు కొత్తగా కనిపించింది.పంట చేతికందిందేమో, తాకట్టు నుంచీ విడిపించుకున్న నగలతో మెరిసి పోతోంది.ఆరు పదులు దాటినా ఎవరిమీద ఆధార పడని పోచమ్మ అంటే మా సాహెబ్ కి ఎంతో గౌరవం.  

మెల్లెగా నేను ప్రయాణం సాగిస్తున్నాను.సుమారు పాతికేళ్ళ వయసున్న బక్క పల్చని కుర్రాడు నన్ను ఆపాడు.ఏదో తెలియని నిరాశ స్పష్టం గా కనిపిస్తోంది.ఎక్కడో అన్యాయాన్ని ఎదుర్కున్నట్టు ఉన్నాడు. బస్తీకి కొత్తేమో.ఇక్కడ ఇవి సహజమని తెలియదనుకుంటాను పాపం

అతన్ని చూడగానే తెలియని ఆత్మీయత నాలో పొంగింది.అక్కున చేర్చుకుని ఓదార్చాలనుకున్నాను.ఇక్కడి మనుషుల గురించి మొత్తం చెప్పెయ్యాలనుకున్నాను.కానీ నాకు మనుషుల లాగా చెప్పడం రాదే! నాకు తెలిసినదల్లా నన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరినీ సుఖం గా వాళ్ళ గమ్య స్థానాలకి చేర్చడం మాత్రమే! 

ఖాన్ సాహెబ్ కిక్కు ఇవ్వడం తో నేను మళ్ళి నా ప్రయాణాన్ని సాగించాను.దూరం గా నల్లభై ఏళ్ళ నిండు వ్యక్తి.సూటూ బూటు లో ఉన్నాడు.ఈ తీరు వాళ్ళంతా సాధారణం గా అందరితో కలిసి ప్రయాణించడానికి   ఇష్టపడరు.మీటరుకి ఇంకాస్త ఎక్కువ ముట్టజెప్పి అందరినీ దిగబెట్టమని డ్రైవరుతో ఒప్పందం కుదుర్చుకుంటారు
 
అంతా చేరాల్సింది ఒకటే చోటికన్నప్పుడు మార్గ మధ్యం లో ఈ తేడాలు ఏంటి అని మా ఖాన్ సాహెబ్ ఇలాంటివి అస్సలు ప్రోత్సహించేవాడు కాదు.

పక్కన దెబ్బతిన్న కారుని చూసి, ఖాన్ సాహెబ్ ఆ వ్యక్తిని ఎక్కించుకున్నాడు.
గమ్మత్తుగా ఆ వ్యక్తి ఎలాంటి బేషజాలు లేకుండా కూర్చున్నాడు.
నా అంతరంగం సాహెబ్ కి అర్ధమయ్యిందనుకుంటాను,వెంటనే ఇదే విషయాన్ని అడిగేసాడు

” అదేంటి సాహెబ్ అలా అడిగావు,నేనూ మనిషినే,వీళ్ళూ మనుషులే కదా,వీళ్ళ పక్కన కూర్చోవడానికి అభ్యంతరం దేనికి ”

“మీరు బాగా ఉన్నోళ్ళు కదా బాబయ్య ” అని జంకుతూ అందుకుంది పోచమ్మ

“అమ్మా!రెక్కలే మనకు చుట్టాలు కదమ్మా.మరి ఇందులో ఉన్నోడూ,లేనోడూ ఏంటమ్మా!”

ఈ మాటలు విన్న నాకు ఎంతో ఆనందం వేసింది.

“కడుపు నిండింది కాబట్టి మీరు ఎన్ని మాటలైనా మాట్లడతారు లేండి సార్! అవసరం మీది కాబట్టి మా పక్కన కూర్చున్నారు గానీ ” కోపం గా అందుకున్నాడు ఆ యువకుడు

“అంత కోపమెందుకొయి! నేనూ ఈ మట్టిలో పుట్టిన వాడినే.నాకు కష్టం సుఖం తెలుసోయ్”
 
“ఊరుకోండి సార్!ఇక్కడ ఇలానే మాట్లడతారు,మా లాంటి వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం చేతులు ముడుచుకుంటారు .

అడిగేవాడికి చెప్పేవాడు లోకువని,ప్రతి ఇంటర్వ్యూ లో ఏవేవో ప్రశ్నలడుగుతారు.మీకు నిజం గా ఉద్యోగం ఇచ్చే ఉద్దేశ్యం ఉండదు సార్.ఇది వరకే అమ్ముడు పోయుంటారు సార్.మీరంతా ఇంతే సార్” అని ఆవేశం గా తన బాధను మొత్తం వెళ్ళగక్కాడు

 

“అబ్బాయి!బాగా ఆవేశం లో ఉన్నావు..ఎక్కడ తప్పు జరుగుతోందో తెలుసుకో.మళ్ళీ ప్రయత్నించు ” అని చెప్పుకొస్తున్నాడు ఆ వ్యక్తి

“మూడేళ్ళనుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నాను సార్!నాకు ఉద్యోగం వస్తుందని,వాళ్ళకి మూడు పూటలా భోజనం పెడతానని ఉన్న పొలాన్ని అమ్మేసారు సార్ మా వాళ్ళు! 
 
బస్తి ఉద్యోగం లో కష్టం తక్కువని, ఉన్న ఊరిని వదిలి వచ్చాను సార్! ” అని కనీళ్ళు పెట్టుకున్నాడు ఆ యువకుడు

“మా ఊళ్ళో డిగ్రీ పూర్తి చేసిన మొదటి వ్యక్తి నేనే సార్! ఇక్కడికి వచ్చాక అర్ధమైంది సార్ మా ఊరి తెలివితేటలు ఎక్కడా పనికిరావని. కూర్చుని చేసే ఉద్యోగం చేస్తానని మా ఊరంతా నా మీద ఆశలు పెట్టుకుంది. మళ్ళీ తిరిగి మా ఊరికి వెళదాం అంటే అభిమానం అడ్డొస్తోంది సార్! ” అని చెప్పుకొస్తున్నాడు యువకుడు

“బాబూ! మేము ప్రతి ఇంటర్వ్యూ లో చూసేది ఒక్కటే.ఒక విషయాన్ని మీరు యే విధం గా అర్ధం చేసుకున్నారు అన్నదే,మీ వల్ల మా సంస్థకు  ఎంత వరకు లాభం అని మాత్రమే.ఆ కొన్ని నిమిషాలలో మీరు ఇది నిరూపించుకుంటే చాలు ” అని చెప్పాడు ఆ వ్యక్తి.

“మీ తరం వాళ్ళంతా కష్టపడి పని చెయ్యగలరు. సరైన దిశానిర్దేసం లేకనే నిరుద్యోగ సమస్య ఇంకా మన దేశాన్ని వెన్నాడుతోంది . ఎవరో నీకు ఉపాధి కల్పిస్తారని ఎదురుచూసేబదులు,నువ్వే నీ లాంటి పది మందికి ఎందుకు జీవితాన్ని ఇవ్వకూడదు ?
 

“అబ్బయ్యా….2 రూపాయలో నేను పూల వ్యాపరం మొదలు పెట్టినా.ఇద్దరు కొడుకులనీ సర్కారీ నౌకరీ వచ్చేంత వరకు సాకినా. కాలుమింద కాలేసుకుని తిందామని ఆశపడినా.ఈ రెక్కలు సుఖపడడం ఆ దేవుడికి ఇష్టం లేదేమో. ఇద్దరు బిడ్డలూ పాపపు సొమ్ముకి అలవాటు పడినారు.

పరుల సొమ్ము వద్దని ఎన్నో సార్లు జెప్పినా. ఒకడి కడుపు గొట్టి తినే కూడు అరగలేదు. మళ్ళీ నా పూల వ్యాపారానికి వచ్చేసినా. నేను రోజూ తినే మెతుకులు ఎవరి దగ్గరా అన్యాయం గా సంపాదించినది గాదు.ఆ సంతోసం తోనే బతుకీడుస్తున్నా ” అని పోచమ్మ తన గోడు చెప్పుకొచ్చింది  

“చెప్పడానికి బాగానే ఉంటాయి సార్ ఇలాంటి మాటలు,నా మీద నమ్మకం తో పెట్టుబడి పెట్టేది ఎవరు సార్,ఇన్ని మాటలు చెప్పిన మీరు పెడతారా? ” అన్నాడు యువకుడు

“తప్పకుండా నువ్వు కష్టపడతావ్ అని నిరూపించుకో ,నీ మీద పెట్టుబడి నేను పెడతాను ,ఎలా నిరూపించుకుంటావ్ అన్నది నీకే వదిలేస్తున్నా” అని సవాల్ విసిరాడు ఆ వ్యక్తి.దిగబోతూ తన పేరూ,అడ్రస్సు ఆ యువకుడి చేతిలో పెట్టి మరీ వెళ్ళిపోయాడు.

నాకు ప్రయాణమూ కొత్త కాదు,ప్రయాణీకులూ కొత్త కాదు.ఇలాంటి రోజు మాత్రం ఎప్పుడూ నా అనుభవం లో రాలేదు .

పోచమ్మ దిగాల్సిన సమయం వచ్చేసింది. “అబ్బయ్యా! నీ అంత సదువుకున్న దాన్ని గాదు.నిషానీ దాన్ని నేను సెప్తున్నా అనుకోనంటే ఒక్క మాట సెప్తాను. ప్రతి పనిలో కష్టం ,సుఖం రెండూ ఉంటాయి.ఒకటి లేక పోతే రెండో దాని ఇలువ తెలియదు.
రేపు ఎంత సంపాదించినా,ఎంత ఎత్తుకెదిగినా ఎక్కడ మాత్రం పక్కనోల్ల సొమ్ముక్కి ఆశపడద్దు.మొదటి ముద్ద తినే ముందు ఈ మాట ఆలోచించు” అని పోచమ్మ చెప్పి దిగేసింది

నాలో ఎన్నో ఆలోచనలను మొదలయ్యాయి.ఎలాగో అలా రోజుని గడిపే నాకు ఈ రోజు కొత్త ఊతపిరి పోసింది.

“ఎక్కడ దిగాలి అబ్బయ్యా” అంటూ  ఖాన్ సాహెబ్ నిశబ్దాన్ని ఛేదించాడు

“తెలియదు సాహెబ్”

“మరి ఎక్కడికి వెళ్దామని ఎక్కావ్ ?”

“ఏమో సాహెబ్ గుర్తులేదు.నీకు తెలిసిన ఏదైనా పని దగ్గర  దిగబెట్టు సాహెబ్”

“సదువుకున్నాల్లకి ఇప్పించే పని నాకేమి తెలుసు అబ్బయ్యా”

“కూలీ పని అయినా చేస్తాను సాహెబ్  “                         

“పేనా బట్టుకునే సేతులు,పార బట్టలేవు అబ్బయ్యా”

“తప్పదు సాహెబ్,నా రోజు గడవాలి అంటే తప్పదు”

“నా కాడ ఒక పని ఉంది అబ్బయ్యా,నీ సదువికి మాత్రం తగినది కాదు.నువ్వు సేత్తా అంటే ……”

“తప్పకుండా చేస్తాను సాహెబ్,అన్యాయం కానిది అంటే తప్పకుండా చేస్తాను” అంటూ ఉత్సాహం గా అందుకున్నాడు ఆ యువకుడు

“ఈ నా బేటీనీ తిప్పాల.వచ్చిన దానిలో ఇద్దరికీ సగం సగం” అని నన్నూ చూపిస్తూ అన్నాడు సాహెబ్

నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పిన రోజది.ఖాన్ సాహెబ్ చేతి నుంచీ బాషా సాహెబ్ చేతికి మారిన రోజది

చాలా త్వరగా బాషా సాహెబ్ నన్ను మచ్చిక చేసుకున్నాడు.ఖాన్ సాహెబ్ కి గురి కుదిరింది బాషా సాహెబ్ మీద.పక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నన్ను ఒంటరిగా బాష సాహెబ్ దగ్గర వదిలి పెట్టి పోయేవాడు

మెల్లెగా ఖాన్ సాహెబ్ ఆరోగ్యం మరింత క్షీణించింది.చూపూ మందగించింది.నన్ను ఇదివరకటిలాగా చూసుకోలేక పోతున్నాననే బెంగ ఎక్కువ అయ్యింది

బేగం సాహిబాను అత్తగారింట్లో దిగపెట్టి నట్టు నన్ను ఎన్నో జాగ్రత్తలు చెప్పి,కన్నీళ్ళాతో  బాషా సాహెబ్ కి  అప్పగించాడు
 
అప్పుడప్పుడు వచ్చి నన్ను పూలతో అలంకరించి చూసుకుని పోయేవాడు ఖాన్ సాహెబ్

బాష సాహెబ్ తో కలిసిపోవడానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు. మా ఇద్దరి మనస్తత్వం దాదాపు ఒకేలా ఉండడం తో ఒకరి మనసు ఒకరికి చాలా త్వరగా అర్ధం అయ్యింది

బాష సాహెబ్ కి పని పట్ల ఎంతో నిబద్ధతతో పాటు,తనలాంటి ఎంతో మదికి ఉపాధి కల్పించాలి అన్న ఉద్దేశ్యం ఉండేది.

అదే ఆశయం గా మారి రాత్రీపగళ్ళు కష్టపడేలా చేసింది.
బస్తీ లో ఒక ప్రముఖ ఆటో సంస్థ అధినేత గా ఎదిగినా,తన దిన చర్య మాత్రం నాతోనే ప్రారంభించేవాడు

ప్రతి రాత్రీ తాను ఆ రోజు చేసినవ్వన్నీ నాతో చెప్పుకునేవాడు
మనసు భారం గా ఉన్న రోజు నాతో కలిసి నిద్రపోయేవాడు

మా అనుభంధం చాలా విచిత్రం గా అనిపించేది నా తోటి ఆటోలకు.
నాకే ఆశ్చర్యం గా ఉంటుంది.ఎక్కడి నేను,ఎక్కడి సాహెబ్ అని.

********
చల్లటి నీళ్ళు కాళ్ళ మీద పడ్డాయి.
చోటా సాహెబ్ నా టైర్లను కడుగుతున్నాడు
ఏదో పశ్చాతాపం కళ్ళల్లో స్పష్టం గా కనిపిస్తోంది
నాకూ దుఖం పొంగుకొచ్చింది.బిడ్డ రాత్రంతా ఎంత బాధ పడ్డాడో!

నన్ను మొదటి సారి అధిరోహించిన తన్మయత్వం లో ముందుకు  సాగుతున్నాడు చోటా సాహెబ్.
“శతమానం భవతి” అని మనస్పూర్తిగా ఆశీర్వదిస్తూ నేనూ సాగిపోతున్నా……
 
 
 

 

 

 

 

 

 

 
 
 

 

  

 
 
  
 
 
 
 
 
 
 

 

Published in: on ఏప్రిల్ 20, 2008 at 4:19 ఉద.  17 వ్యాఖ్యలు  

The URI to TrackBack this entry is: https://vaagdevi.wordpress.com/2008/04/20/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b1%87%e0%b0%b5-%e0%b0%9c%e0%b0%af%e0%b0%a4%e0%b1%87/trackback/

RSS feed for comments on this post.

17 వ్యాఖ్యలువ్యాఖ్యానించండి

 1. శ్రమయేవ అనుకుంటానండి

 2. శ్రమ+ఏవ=శ్రమేవ
  సంధి లో తప్పులేదనుకుంటాను

 3. !!శ్రమయేవ జయతే!

  అని చదువుకున్నాం చిన్నప్పుడు !!!!

 4. CHALA BAGUNDI

 5. అక్కయ్యా, శ్రమ ఏవ కలిస్తే శ్రమైవ అవ్వాలికదా వృద్ధి సంధి ప్రకారం. అసలుకి श्रम एव जयते ఒప్పు. శ్రమః ఏవ లో విసర్గ లోపిస్తే శ్రమ ఏవ అవుతుంది. అది సంస్కృతవాక్యం కాబట్టి యడాగమంచేసి శ్రమ యేవ అనటం కూడా తప్పే.

 6. కథ బాగుంది. శ్రమని నమ్ముకోడమనే ఇతివృత్తం పాతదైనా, ఆటో ద్వారా కథని చెప్పించడం కొత్తగా ఉంది. కథనం కూడ వేగంగా సాగింది. అభినందనలు.
  కొల్లూరి సోమ శంకర్

 7. ఆటో ద్వారా కథ చెప్పించడం… బాగుంది కథ… 🙂
  అందుకే నీకు చెప్పేది …. రెగులర్ గా రాయమని… కొ.పా. గారికి కృతజ్ఞతలు…. ఈ పద్ధతి మొదలు పెట్టి… లలితా స్రవంతి చేత కథలు క్రమం తప్పకుండా రాయిస్తున్నందుకు. 🙂

 8. బాగుంది. నాకు తెలిసి శ్రమ+ ఏవ = శ్రమైవ అవ్వాలి వృధ్ధి సంధి ప్రకారం.
  ఆటో దృష్టిలో చెప్పడం బాగా నచ్చింది నాకు.

 9. ఆసం! చాలా బాగుంది కథ.
  ఒకే ఒక్క చోట చిన్న వెలితి కనబడింది. సూటు వేసుకున్న వ్యక్తితో సంభాషణ కొలిక్కి రాలేదు. అంతగా వాదించి పెట్టుబడి పెడతానన్న తరువాత అతన్ని ఎందుకు కలవలేదో మరి ఈ భాష.
  అక్కడెక్కడో కొద్దిగా గతి తప్పినట్టనిపించింది.

 10. @ప్రవీణ్
  మీరన్న మాట నిజమే
  నేను కథ అనుకున్నప్పుడు ఈ సూటు వేసుకున్న వ్యక్తి కొన్నాళ్ళ తరువాత తన దగ్గర పని చెయ్యమని చెప్పడం,ఈ బాష తిరస్కరించడం,తనకు ఈ పనిలో చాలా తృప్తి ఉంది,అనడం చెప్తాదమనే అనుకున్నాను.అప్పటికే కథ పెద్దది అవ్వడం తో ఈ పాత్రని ముగించేసాను
  మీ సూచనకు ధన్య వాదములు
  @సోదరుడు రాఘవ,దైవానిక, రాజేంద్ర
  తప్పుని సరిదిద్దినందుకు ధన్యవాదములు
  @సౌమ్య,కొల్లూరి
  నెనర్లు.మీ లాంటి చెయ్యి తిరిగిన వారినుంచి బాగుంది అని చెప్పించుకోవడం ఆనందం గా ఉంది

 11. చాలా చాలా బావుందండీ! ఊహించని కోణంలో చెప్పారు..

 12. మీరు అనుకుంటున్నట్లుగా నేనేదో చెయ్యి తిరిగిన రచయితని కానండి.అనువాదాలలో పర్వాలేదేమో గానీ, సొంత కథల విషయంలో నేనింకా నేర్చుకునే దశలోనే ఉన్నాను.

 13. కథా శిల్పం, గమనం, శైలి, చాలా బావున్నాయి. ఆటోతో వ్యాఖ్యానం(narrative) నడపటంతో నవ్యత అబ్బింది.

  ఒక చిన్న సూచన. సంభాషణలు కథానుసారం ముస్లిం మతస్థుల భాష, యాసలలో నడిపి ఉంటే ఇంకా బాగా రాణించేదేమో. అంటే నా ఉద్దేశ్యం సాధారణ ముస్లిం మతస్థులు తెలుగును ఎలా మాట్లాడతారో అలా వాడింటే బావుంటుంది అని.

 14. @భావుకుడు గారు
  మీరు చెప్పింది నిజమే.అలా చెప్పి ఉంటే బాగుండేది
  నాకు ముస్లిం మతస్థుల యాస సరిగ్గా తెలియదు
  అందుకే రాయలేదు
  మీ సూచనకు ధన్యవాదములు

 15. నా ఈ కథకు బహుమతి రావాడం చాలా ఆనందం గా ఉంది
  కథా ఇతివృత్తం ఇచ్చి ప్రోత్సహిస్తున్న కొత్తపాళి గారికి ధన్యవాదములు
  ఈ కథను ఆసాంతం చదివి “బానే ఉంది లే” అన్న మా నాన్నగారిని ఈ సంధర్భం గా ప్రస్తావించకుండా ఉండలేను

 16. బహుమతి విజేతకు అభినందనలు.

 17. చక్కగా చెప్పేరు మా మంచి కథ.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: