తెల్ల కాగితం

“అమ్మా!!మీ కోసం ఎవరో వచ్చారు..” అంటూ బోసు కబురు మోసుకొచ్చాడు
నాకోసం ఎవరో రావడం ఏంటీ ?
అదీ ఇంత తుఫానులో……..

ఎవరై ఉంటారబ్బా…?
వయసు ఉడిగిపోయిన నాకోసం వెదుక్కుంటూ వచ్చేవారెవరు…?అనుకుంటూ వడి వడిగా బోసు వెనాకాలే నడక సాగించా.
 
ఎదురుగా ఎవరూ లేరు

3 రోజులనుంచీ ఏకధాటిగా వర్షం కురవడం తో మా ఆశ్రమం అంతా ముసురు లో ముసుగేసింది.ఎప్పుడూ ఏవో లెక్కలు రాసుకుంటూ ముందటి వరండాలో నిండుగా ఉండే సుబ్బయ్య కూడా శెలవు పెట్టాడు.

జాతీయదినోత్సవాలలో తనలో ‘మనీ’ ని పక్కన పెట్టే మనుషులే తప్ప ,మామూలురోజుల్లో పెద్ద అలికిడి ఉండదు  మా ఆశ్రమం లో.

అప్పుడప్పుడు సావిత్రమ్మ మనవడు పరీక్షలకు ముందస్తు తయారిలో భాగం గా రాసే ఉత్తరం తప్ప ,బయటి నుంచీ మాకొచ్చేవి ఏవీ లేవు.
    
“ఉండండమ్మా  ఆయన ఎక్కడికి పోయాడొ కనుక్కొస్తా”అంటూ నన్ను వరండాలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు బోసు.
ఎవరై ఉంటారబ్బా……ఇంత అర్థరాత్రి,వర్షం లో ,అదీ నా కోసం…….?

“అమ్మా!!!!” అన్న బోసు పిలుపుతో ఉల్లికిపడ్డ నా ఎదురుగా ఒక నిండు విగ్రహరూపితుడైన వ్యక్తి

ఆ కళ్ళు నాకు బాగా తెలిసిన కళ్ళు
ఆ కళ్ళు ….నా మూగ ఊసులన్ని పంచుకున్న కళ్ళు
 
నేనెక్కడైనా ఉన్నానేమొ అని ఆ కంటి లోగిలో మెల్లెగా ప్రవేశించా…. బాహ్య ప్రపంచపు గదులన్ని దాటుకుంటూ వెళ్ళా 
 
…ఆ కనిపించింది……ఏ మలినం లేనిది…..తన అందమైన శరీరమనే తాలూకు పరదాను పక్కకు తోసేసి,జీవితాన్ని తనదైన తీరులో మలచుకున్నది  
 
“ఇంకా గుర్తున్నానా మాష్టారు.?”
“పదమ్మా ఇంటికి వెళ్దాం…”
“ఎవరింటికి మాష్టారు ?”
“అమ్మా…నీ కొడుకు కలెక్టరీ పాసయ్యాడు,అక్కడికే వెళ్దాం పదమ్మా,నిన్ను తీసుకువస్తానని మాటిచ్చాను ”
“అంత ఆశలేదు మాష్టారు,ఈ కట్టె పుచ్చి పోయిందని తెలిసినా,ఇనాళ్ళు భద్రం గా దాచుకున్న ఈ ఆశ్రమం లోనే కాలనీయండి..”
 
“అంత మాట అనకమ్మా…నీ మనసు మలినం లేని మేలిమి బంగారం…ఆ పాత ఙ్ఞాపకపు ఛాయలు గుర్తుండకూడదనే కదమ్మా నీకు ‘కాంచన ‘ అని పెట్టింది ”
 
“మర్చిపోవాలన్నా మర్వనివ్వనివి మాష్టారు అవి…”

ఒక్క నిమిషం ,ఇప్పుడే వస్తాను

“ఈ వీలునామా అబ్బాయికి అందివ్వండి …”

నేను వీలు నామా రాయడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా ? 
 
ఉంది మాష్టారు నేనూ వారసత్వం గా ఇవ్వాల్సినది.మొన్న పేపరు లో చదివాను,అబ్బాయి రామాపురానికే కలెక్టరీగా వెళ్తున్నాడు అని.

ఈ కాగితం గుర్తుందా మాష్టారు ?
పాతికేళ్ళ క్రిందట మీ దగ్గర తీసుకున్నది
గుర్తున్నదా  ఆ రోజు……..

*******************************************************

“…ఏమిటే నిన్న రాత్రి వచ్చిన వాడిని పదో పరకో అడగకుండా పట్నం నుంచీ బొమ్మల పుస్తకం తెమ్మాన్నావా ?
నీకు ఈ కొత్త మాయరోగం ఎప్పుడు పుట్టిందే  ? ”

” అమ్మా….నేను సదువుకుంటానే ….”

“సదువా….అదేందే….హాయిగా ‘పడుకుని సంపాదించమంటే…..సదువుకుంటా అంటావేందే… ..?”  
ఈ కొత్త పిచ్చి పట్టుకున్నందుకా నిన్న వచ్చిన గిరాకీని బొమ్మల పుస్తకం తెమ్మన్నావ్ ….ముదనష్టపు దానా…ఈ రోజు కడుపుకి లేకుండా జేసినావ్…….”

“….శివాలయం లో గోవిందయ్య మాష్టారు అందరికీ సదువు సెప్తున్నాడట ,ఈ రాత్రికి ఆడికోతానే… ”

“అమ్మా,తల్లీ  అని నిదానం గా సెప్తుంటే మాటవినవేందే….లేచి త్వరగా నలుగు పెట్టి స్నానం సెయ్యి,రాత్రి పక్క ఊరి ఎం ఎల్ యె వస్తున్నాడు…ఎక్కువ గిట్టుబాటు అవుతుంది……”

“నేను ఎల్లనే ఆడిదగ్గరికి….”

***************************************************

శరీరం మీద ఏదో పాకుతున్న భావన,చీడపురుగే…సందేహం లేదు …
ఎదురుగా తెల్లని చొక్కా జేబులో మెరుస్తూ కనిపిస్తోంది పెన్ను…

రామాపురం మా గ్రామం.దాదాపు 20 కుటుంబాలందరికీ ఇదే కుల వృత్తి.గిట్టుబాటు అయ్యే పదో పదిహేనుకి నిత్యం నలిగి పోయేది ఎన్నో కలలుగనే శరీరాల మాటున దాగున్న మా మనసులు.
ఇదే జీవితం అని ఆనందం వెదుక్కుంటూ అంకితభావం చూపించే వారు కొందరైతే,దీనినుంచీ బయట పడాలి అని ప్రయత్నం చేసి విఫలమైన వారు కొందరు,పారిపోయి కొత్త జీవితం మొదలు పెట్టాలి అని నిత్య ఆశావాదులు ఇంకొందరు.
 
వీరందరినీ ఏదో ఒక రోజు మారుస్తా అని నడుం కట్టిన గోవిందయ్య మాష్టారు లాంటి వారు ఇంకొందరు .మాష్టారు అంటే నాకు ఏదో తెలియని అభిమానం.సుఖనారీమణుల మధ్య శుకుడి లా ఉండే మాష్టారు ఏమీ కానీ మా కోసం అంత తపన పడడం చూసినప్పుడల్లా నాలో ఏదో ఆశాజ్యోతి వెలిగేది
ఈ రొంపి నుంచీ బయటపడి నేనుగా బ్రతగలను అన్న ఆశ.

“అటేందే సూస్తున్నావ్,నన్ను సూడవే ” అన్న పిలుపుతో ఉలిక్కి పడ్డా

“తు నీ యబ్బా……..ఇదిగో నీ 20……” 

“ఈ డబ్బు బదులు ఆ పెన్ను ఇవ్వండయ్యా…….?”

“.దానికి ఇంకో మారు నాకాడికి రావాలా,వస్తావా ? ”

చేతిలో నిగనిగ లాడే కొత్త పేనా.దీనితో ఏదేదో రాసెయ్యాలి.రాసేసి,సదివేసి ఏదేదో అవ్వాలి.మాష్టారీ సదవాలి.సదివి లక్ష్మిని ఇక్కడినున్సీ తీసుకెల్లాలి.తీసుకెల్లి ఇంకా ఇంకా సదివించాలి.పాపం పిచ్చిది,మూలకూసున్న మూడవనాటి నుచే దీనిలో……

“తూ యాడ ఆలోసితున్నావే ……మనసంతా పాడుసేసినావే…నీ యమ్మ నువ్వేదో అని 100 ముందే గుంజి నాది….తు మీ బతుకు…..”  
 
నిజమే….ఇదీ ఒక బతుకేనా…..ఎందుకో తెలియని బతుకు,నాకు నేను పనికి రాని బతుకు.
ఒక నాడు  తెల్లవారు ఝామునే మాష్టారు ,తెల్లటి చొక్కా లో ,తెల్లని సుద్దముక్కతో, అంతకన్నా తెల్లనైన మనసుతో మాష్టారు వెళ్తుండడం చూసి ధైర్యం చేసి నా మనసులోని మాట చెప్పాను.తెల్ల కాగితం ఒకటి చేతికి ఇచ్చి నీకు ఎంతవరకు రాయడం వచ్చో చూపించు అన్నారు.

ఇంతకాలం బొమ్మల పుస్తకాలలోరహస్యం గా రాసుకున్న నాకు ఆ తెల్లకాగితపు స్పర్శ కొత్త ధైర్యాన్ని ఇచ్చింది
 
“ఈ నరకం నుంచీ విముక్తి పొందాలి అంటే ఏమి రాయాలి ??” అని గద్గద స్వరం తో నాకు తెలియకుండానే పలికేసాను
 

“అయితే ఈ రాత్రికే నీ ప్రయాణం,శివాలయం దగ్గర 1  కి ”
చేతిలో తెల్లని కాగితం.మొదటి సారి స్వేచ్చగా గడపడాటుతున్న ఆనందం.ఆఖరు మాట కాగితం మీద రాద్దామనుకున్నా.

” …ఎవరికి రాయాలి? జాగ్రత్త తీసుకోనందుకు ప్రతిఫలం గా 9 నెలలు నన్ను మోసిన తల్లికా?
కొత్తగా డబ్బు సంపాదించే మార్గం దొరికిందని తండ్రి అవతారం ఎత్తి,నన్ను వ్యాపారం చేసిన తండ్రికా ? ఈ కాగితపు విలువ తెలియను వాళ్ళకు రాయడం కూడా వృధా…….”  అనుకుని కాగితాన్ని జాగ్రత్తగా పెట్టెలో  దాచుకున్నా.
  
మాష్టారి సహాయం తో ఒక ఆశ్రమం లో కొత్త జీవితాన్ని ప్రారంభించాను .పచ్చని చెట్లు,కడుపునిండా భోజనం,కావలిసినన్ని పుస్తకాలు.

నా మనసుకి సంబంధం లేకుండా కలిగిన విషబీజాన్ని మాష్టారే చదివిస్తానని తీసుకెళ్ళారు.నా వంతుగా కాగితాన్ని తీసి ఏదేదో రాసి వాడి చేటిలో పెడదామని  ఆశ.

“అయినా ఏమి రాయాలి,జీవితం లో ఏమి సాధించానని రాయాలి,నా నీడ ను కాగితం రూపం లో అందించి  బంగారు భవిష్యత్తుకి చీకటి క్రీనీడను అందించను….”  అని మళ్ళీ కాగితాన్ని భద్రపరిచాను

*************************************

“వీలునామా అని తెల్ల కాగితం ఇస్తున్నానేమిటి అని చూస్తున్నారా మాష్టారు? ”

ఈ కాగితానికి నా జీవితంలోని ప్రతి మలుపు తెలుసు మాష్టారు,తెల్లగా కనిపించినా ఎన్నో వర్ణాల ఊసులని మూగగా తనలో లీనం చేసుకున్నది.నా చీకటి జీవితాన్ని రహస్యం గా తనలో పొదిగిపెట్టుకున్నది. 

నా కోరిక ఒకటే మాష్టారు..ఆ రామాపురం లో అందమైన జీవితపు ఇంద్రధనస్సు చూడని బ్రతుకులెన్నో.వారి కోసం తనవంతుగా ఏదైనా చేసి,నా లాంటి తెల్ల కాగితాల మీద అందమైన బొమ్మను వెయ్యమనే …..

నా జీవితానికి ఇన్నాళ్ళకు సార్ధకత వచ్చింది అని తృప్తి గా నవ్వుతూ మాష్టారి జేబులోంచి వీడుకోలు చెప్తోంది “తెల్ల కాగితం ”  
 
   
 
 
   
 
 
 
 
  
 
  
 

Published in: on మార్చి 15, 2008 at 12:10 ఉద.  15 వ్యాఖ్యలు  

The URI to TrackBack this entry is: https://vaagdevi.wordpress.com/2008/03/15/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%95%e0%b0%be%e0%b0%97%e0%b0%bf%e0%b0%a4%e0%b0%82/trackback/

RSS feed for comments on this post.

15 వ్యాఖ్యలువ్యాఖ్యానించండి

 1. అయ్య బాబోయ్! మరీ ఇలా గుండెలు పిండేస్తుంటే ఎలాగండీ బాబూ!

 2. Bravo!

 3. చాలా బాగుంది.
  “ఆమె” లోని భావాలను చక్కగా చూపించగలిగారు.

  అభినందనలు.

 4. బాగుంది, ఇంతకంటే మాటలు రావటంలేదు.

 5. గుండె బరువెక్కిందండి.చాలా బాగా రాసారు.

 6. చాలా బాగా వ్రాసారు. ఎన్నో కోణాలను స్పృశించి మా మనసుల్ని కదిలించారు. కొత్తపాళి గారు చూపించిన నూతన మార్గానికి మీరు రిబ్బన్ కట్ చేసి మంచి బోణీ ఇచ్చారు.

 7. ప్రత్యక్షం గా కధా వస్తువును ఇచ్చిన కొత్తపాళీ గారికి,పరోక్షం గా ఒక యదార్థగాథను చెప్పిన సోదరుడు “మారుతి”కి ధన్యవాదములు

 8. బాగుం్దండీ,చాలా బాగా రాసారు.

 9. అభినందనలు. బాగా రాసారు. కథ ఇతివృత్తం కూడా వైవిధ్యంగా ఉంది.

  కొత్తపాళీ గారు కథా వస్తువు “పదేళ్ళ పిల్లవాడు” అంటూ ఇచ్చారు, కథలు రాసిన వారంతా తూచా తప్పకుండా అదే gender follow అయ్యారు, మీరు తప్ప, అందుకు మరో మారు అభినందనలు..

 10. @చదువరి గారు…..
  ధన్యవాదములు.
  నేను అసలే కాస్త తింగర దాన్ని.ఇలా చెయ్యి అంటే,అలా తప్ప అన్ని రకాలుగా చేసే తత్వం…కాబట్టి ఈ పైత్యాన్ని బ్లాగర్లు భరించాల్సిందే 🙂

 11. చాలా బాగా వ్రాసావక్కా. కించిత్తు బాధ కూడ పెట్టావీ కథతో.

 12. పోటీలో మీ ముందు మేమా?? అన్నంత బాగుంది మీరు రాసిన కధ. చాలా చాలా బాగుంది లలితాస్రవంతిగారు.

 13. BAGUNDI

 14. చాలా బావుంది స్రవంతి గారు. నాకు ముఖ్యంగా నచ్చిన విషయం తెల్ల కాగితానికి మీరు ఇచ్చిన వివరణ. తెలుపు వర్ణ విహీన కాదు సర్వ వర్ణ సహిత అని మీరు చెప్పిన వ్యాఖ్యానం నిజంగా అద్భుతం. భేష్.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: