బతకమ్మ బతకమ్మ ఉయ్యాల

అసలు నా బతుకు ఎలా అయ్యిందంటే నవరాతృలు వచ్చినా,పూర్తి అవుతున్నా నా అంతః,బాహ్య ప్రపంచకాలలో  మార్పేమి రాలేదు.

అదే 3వ నంబరు బస్సు,అదే కండక్టరు బాబాయి,అదే కాలేజీ,అదే పక్క బెంచి పావని,అదే లూసు షర్టు హనుమంతరావు సారు.

నేను నిద్ర లేవక ముందే మా ఇంట్లో ఏవో పూజల పేరిట దేవుడి ఊపిరి తీసేపనిముగించేస్తారు కాబట్టి ,నా వ్యక్తిగత జీవితానిలోనూ పెను తుఫాను ఏమీ లేదు.
 
మనం ఇలా ఉన్నాం,పక్క వాళ్ళెలా పండగ చేసుకుంటున్నారో అని పావని కి ఫోను చేసాను
ఎలా చేసుకుంటున్నావే పండగ అంటే..”ఏముందే ఈటీవీ సుమన్ కి అవార్డుల షాపు ఇచ్చేసారు,ఏది కావాలో తీసుకొ అని,మా టీ వీ లో “అస్కో బుస్కో కాస్కో……..దమ్ముంటే చూస్కో” సినిమా ,ఇక టీ వీ 9 లో పండగ రోజు చిరంజీవి అల్లుడి మీద ప్రత్యేక వార్తా  కధనం” అంటూ అన్ని చానళ్ళ పట్టిక చెప్పేసింది.

ఇలా కాదని  మా సన్నీ గాడికి ఫోను చేసాను.వాడినీ అడిగాను పండగకు ఏమి చేస్తున్నావు రా అని.వాడు 3 సినిమాలు,6 పార్టీలు,12 కేకు కటింగులు అని చెప్పాడు.

దేవుడా  అని ఒక నిట్టూర్పూ సట్టూర్పు వదులుతున్న తరుణం లో దూరం గా మైకు లో “బతకమ్మ బతకమ్మ ఉయ్యాల….” అన్న పాట వినిపించింది.

   
అసలు ఎవరీ బతకమ్మా,ఆమెకు ఉయ్యాల ఏంటి,ఆమెకు ఉయ్యాల ఊగేంత తీరిక ఏలా ఉంది,ఆమె ఆర్కుట్ లో లేదా అని బోలెడు ధర్మ సందేహాలు నాకు వచ్చేసాయి  
 ఈ పాట నాకేంటి తెగ అర్థమై పోతోంది,తెలుగు పాట కాదేమో అని ఆ పాట వైపుగా పయనం సాగించా. 
 
రాజీవ్,ఇందిరమ్మ ల గుడిగా ఇంకా రూపాంతరం చెందని “శివాలయం ” అది
విశాలమైన ప్రాంగణం.
వేప,రావి,నేరేడు చెట్లతో చల్లగా ఉంది.
“ఆమ్మవారు దుర్గాదేవి అలంకారం లో విరాజిల్లుతున్నారు,భక్తులు దర్శనం చేసుకోగలరు” అని మైకు లో చెప్తున్నారు
 
నా అడుగులు తమంతట తామే గుడిలో ప్రవేశించాయి.దివ్య మంగళ హారితి వెలుగులో అమ్మ నిండుగా కనిపిస్తోంది.పెద్ద కళ్ళు,దీపాల వెలుగులకి పోటీగా మెరిసే ముక్కెర,ఎర్రటి చీర.

అంతలో పూల పళ్ళాలతో ఆలయం లో కొందరు ముత్తైదువులు  ప్రవేశించారు. 
ఆ పూల గుత్తే “బతకమ్మ”
తమ శక్తి ని బట్టీ ఒక్కొక్కరు రకరకాల పూలను గుండ్రం గా ఒక పళ్ళెం లో అలంకరించారు
ఆ గుత్తి మీద పసుపుతో చిన్న ఆకృతి పెట్టారు

మెల్లెగా ఆడవాళ్ళ రాక పెరిగింది.వాటితో పాటే ఈ బతకమ్మలునూ.ఒక చోట అంతా దగ్గర చేర్చి చుట్టు మూగారు.దాని చుట్టు చపట్లు కొట్టుకుంటూ తిరుగుతూ పాటలు పాడారు

చీకటి పడడం తో ఈ బతకమ్మలను దగ్గరలోని చిన్న కొలనులో వదిలారు.బతకమ్మ మీద చిన్న దీపం నీళ్ళల్లో అందం గా ఊగుతూ ముందుకు సాగడం ఎంతో అందం గా ఉంది
 
కొంతమంది ప్రసాదం గా అటుకులూ,బెల్లం ఇచ్చారు.
ఇంకొందరు 9 రకాల పిండ్లను నెయ్యి తో కలిపిన మిశ్రమాన్ని పంచారు.

ప్రకృతి ఆరాధనకు నిదర్శనం ఈ  బతకమ్మ.నవరాత్రులు మొదలుకుని,అష్టమి వరకు ప్రతి రోజూ బతకమ్మ ని తయారు చేసి నీళ్ళల్లో వదలడం తెలంగాణ ప్రజల ఆచారం.

పార్వతీ దేవి స్వరూపం గా ఈ బతకమ్మను భావించి కన్నె పిల్లల దగ్గర నుంచీ ,పండు ముత్తైదువుల వరకు ఈ పండుగను సామూహికం గా జరుపుకుంటారు

తెలంగాణ యాస లో సాగే ఈ బతకమ్మ పాటల అంతరార్ధం “సర్వేజనా సుఖినోభవంతు” 
 
ఇంటికి రాగనే ఎదురుగా లైబ్రరీ నుంచీ తెచ్చుకున్న The concept of Socialisation and Inter personnel skills by Stephen.P.Robbins నవ్వుతూ దర్శనమిచ్చింది

బతకమ్మ బతకమ్మ ఉయ్యాలా అని నవ్వుతూ ఈ పుస్తకాన్ని పావనికి బేరానికి పెట్టేసాను

Published in: on అక్టోబర్ 20, 2007 at 5:43 ఉద.  3 వ్యాఖ్యలు  

మన తెలుగు సినిమా పయనం ఎటు?

ఇదే విషయం నేను గత కొంత కాలం గా ఆలొచిస్తున్నా,బ్లాగు రాసేంతగా చేసింది నిన్న నేను చూసిన ఇంటార్వ్యు.
అసలు కథ పట్ల మన దర్శకులకు ఎంత అభిమానం ఉందో అది చూస్తే అర్ధం అవుతుంది .
అసలు ఈ మధ్య సినిమాల్లో కథ నిజం గా ఉంటోందా?
ఈ ప్రశ్నకు ఠక్కున లేదు అనే జవాబే చాలా నోట్ల విన్నాను.
నాకో చెడ్డ అలవాటు.ఎవరు సినిమా చూసా అని చెప్పినా,వెంటనే కథ చెప్పు అని ప్రాణం తీస్తా.
ఈ మధ్య ఈ అలవాటుకి కాస్త విరామమం వచ్చింది.సినిమా  చూసిన వాడెవడూ కథ ఏంటో చెప్పట్లేదు
మామూలు మాటల్లో చెప్పలేని దృశ్య కావ్యం ఏమో అని నేను కొన్ని సినిమాలు లేటుగా చూసాను
నాకు ఆ భావమే కలిగింది.
ఇలా బ్లాగులో నేను చూసిన సినిమా గురించి రాయాలంటే నాకు మాటలు దొరకలేదు.
సరే నా తెలుగు పాండిత్యం ఇంతవరకే అనుకుని తృప్తి చెందాను.
ఇలా నన్ను నేను ఎన్నో సార్లు సమధాన పరచుకున్నా,నిన్న నేను చూసిన కార్యక్రమం ఇలా బ్లాగేంతవరకు నిద్ర పోన్నివ్వలేదు. 
ఈ మధ్య అంతా ‘చిరు’  తనయుడు  పేర విడుదల అయిన  చిరుత.
అలా టి వీ తిప్పుతుంటే పూరి జగనాథ్ కనిపించాడు.అంతా ఆ సినిమా క్లాసులో మాట్లాడుతున్నారు ,నేను ఈ కార్యక్రమం చూసి,సినిమ చూసా అని పోసు కొడదాం అని అనుకున్నా.

సరే వాణిజ్య ప్రకటనల విరామాల్లో పూరి మాట్లాడాడు.పాపం ఈ ఆంకరు ఈ సినిమ  కథ తమ ప్రేక్షకులకు చెప్పిద్దాం అని అడిగిన ప్రశ్ననే రక రకాలు గా అడిగినా పూరి ఒకటే జవాబు చెప్పాడు.
ఈ సినిమాలో కథ ఎమీ లేదు అని,కేవలం మెగాస్టార్ తనయుడిని పరిశ్రమకు పరిచయం చెయ్యడం కోసమే ఈ సినిమ తీసానని,కథని పెద్దగా పట్టించుకోలేదని చెప్పడం నాకు భలే ఆశ్చర్యం వేసింది.

నేను సరిగ్గా వినలేదేమో అని ఆ కార్యక్రమం ఆసాంతం చూసాను.మళ్ళీ అదే చెప్పాడు

ఇక ఏం అనాలీ
కథ నటుడి కోసమా?
నటుడు కథ కోసమా?

మన సినిమాలు ఎందుకు అంతర్జాతీయం గా గుర్తింపు పొందట్లేదు అనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనం

ఎవరో కొడుకుని పరిచెయ్యడం కోసం ఇష్టం వచ్చినట్టు ఒక్కో సినిమా నుంచీ కాస్త కాస్త తెచ్చి అతికించడమేనా?

ఒక గొప్ప నటుడి కొడుకు/మనవడు అని అచ్చేసి జనాల మీద కి తొసేస్తె  చాలా?
వారికంటూ ఒక సొంత గుర్తింపు అక్కరలేదా?
అసలు నటించడానికి వారికున్న కనీస అర్హత ఏంటి?
రంగస్థల అనుభవం ఉండాలని ఆశించడం అత్యాశే గాని,కనీసం నటనకు సంబంధిత శిక్షణ ఎంత వరకు  తీసుకున్నారు?
ఏదో గెంతడం,కొట్టడం నేర్చుకున్నంత మాత్రానా హావభావాలను పలికించే అవసరం వారికి లేదా?

 అసలు నటన ఎదో వారసత్వం కొనసాగింపుకా లేక నిజం గా ఈ కళ పట్ల వారికి అంకిత భావం ఉందా?
 

సినిమా అన్నది దృశ్య కావ్యం గా ఎంత మంది దర్శకులు భావిస్తున్నారు
ఒకప్పుడు సినిమా ఒక భాషలో తీస్తున్నారు అంటే ఆ భాష మీద మంచి పట్టు ఉండేది.
అందుకే అప్పటి సినిమాల్లో సంభాషణలు ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటున్నాం,సమయోచితం గా వాడతాం.
మరి ఇప్పుడు సంభాషణలు రాసేవారికి నిజం గా తెలుగు భాష మీద అంత పట్టు ఉందా?

మా బామ్మకి హిందీ రాకున్నా అప్పట్లో “నవ్ రంగ్ ” సినిమాకు బండి కట్టుకు వెళ్ళిందట.ఇప్పటికీ నేను అడుగుతా మా బామ్మని నీకు ఆ సినిమా ఏం అర్ధం అయ్యింది అని.తను చెప్పే సమధానం ఒక్కటే అక్కడ తెర మీద చేసే వారి ముఖం లో ఎం జరుగుతోందో అర్ధం అవుతుంది కదా,ఇక భాషతో అవసరం ఏంటి అని.  

మరి ఇప్పట నటీనటులు అంత చక్కగా హావభావాలు పలికించగలరా?

అసలు నటీనటుల నుంచీ నిజం గా ఈ దర్శకులు నటనను రాబడుతున్నారా?

అసలు దర్శకులుగా పరిచయ్యం అయ్యేవారికి అన్ని విభాగల మీద పట్టు ఉందా?

ఎంతసేపటికీ పరభాషా చిత్రాల నుండి కథను అరువు తెచ్చుకోవడమే తప్ప నిజం గా మనకు కథలు లేవా?

మన పురాణ కథలనే ఇప్పటికాలానికి అణుగుణం గా ఎందుకు మలచరు?

ఇక్కడ మన తెలుగు పాటలు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది

డాక్తర్ చక్రవర్తి చిత్రం లో “ఓ ఉంగలారల ముంగురులున్న రాజా” అన్న జానపద గీతం లో “తస్సదియ్య” అన్న పదానికి సెన్సారు వారు అభ్యంతరం చెప్పారట.
మరి నేడు?
 
అసలు మన తెలుగు సినిమ అంతార్జాతీయ(కనీసం జాతీయ)స్థాయి పురస్కారం పొంది ఎన్ని ఏళ్ళు అయ్యిందో …

జాతీయ పురస్కారం పొందినా అవి నిజం గా అంత విలువ చేస్తాయా అన్న అనుమానం ప్రతి ఒక్కడికీ కలుగుతుంది

తెలుగు సినిమాకు మహర్దశ రావాలంటే ఈ వారసత్వ నటులు పోయి ఈ కళ పట్ల అంకితభావం ఉన్న వాళ్ళు ,భాష మీద పట్టు ఉన్న వాళ్ళు రావాలి.

ప్రభుత్వం తరపున మంచి కళాత్మక సినిమాలకు రాయతీలు కలిపించి అలాంటివి తీసేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి.

పైరవీలు లేని జాతీయ పురస్కారాలు,అంగాంగ ప్రదర్శననని అనుమతించని సెన్సారు బోర్డు వంటి కనీస చర్యలు తీసుకున్నప్పుడే తెలుగు సిని తల్లి పట్టు బట్ట కడుతుంది

Published in: on అక్టోబర్ 6, 2007 at 12:48 సా.  18 వ్యాఖ్యలు