“కలడందురు దీనుల ఎడ,కలడందురు పరమయోగి గణములపాలన్,కలడందురు అన్ని దిశల,కలడు కలండను వాడు కలడో,లేడో……..”
ఈ ధర్మ సందేహం అందరికీ వస్తుందేమో!!
దీనుల దగ్గర ఉన్నడా…మరి దేశం లో ఎంతో మంది ఉన్నారు…..మరి వారి దగ్గర ఉన్నడా?
మంచి వారి సమూహం లో ఉన్నాడట…..నిజం గా ఉన్నడా….? ఏమో ఉన్నాడేమో…….అయినా మనసుమూల ఏదో అనుమానం… !!
“ధైర్యము విలోలంబయ్యె ,మూర్ఛవచ్చె,తనువుండస్సె శ్రమంబయ్యెడిన్,రావే ఈశ్వర,కావవే వరద సమ్రక్షించు భద్రాత్మకా…….” ఇలా ప్రతి రోజు ఎంతో మంది ఆర్తులు పిలుస్తూనే ఉన్నారు…..
మరి వారికి నిజం గా కనిపించాడా…. ??
మంచి జరిగితే నా ప్రతిభే అనీ,చేడు జరిగితే “విధి ఆడే వింత నాటకం…కర్త ఎవరూ,కర్మ ఎవరూ అని ఒక అతీత శక్తి మీద తోసేస్తాం…..”
కొందరి వాదన ప్రకారం భగవంతుడు అన్న సిద్ధాంతం మానసిక బల్లాన్ని ఇవ్వడానికి ఏర్పరచుకున్నది. నిజమేనేమో….. అయితే ఈ చిన్నారి దేవుళ్ళను మనసారా సేవిద్దాం ***************************************************************
రోజూ వీటిని స్తోత్రాలతో ధ్యానించమని అడగవు.
తమ గుణగణాల మీద కావ్యాలు రాయమనీ అడగవు.
వేల వేల కృతులు వీటి మీద ఎవరూ రాయలేదు(బహుసా ప్రేమ పొంగినప్పుడు ..ఒకటో అరో తమ మనసు మీద రాసుకున్నారేమో… )
ఇంకో జన్మ నీకిస్తా,ఇంకా నా మీద రాయవా అని ఆశచూపించవూ.. మాకు గుడి కట్టించమని ఎవ్వరి కలలోనూ చెప్పవు.
ఫలానా రోజు మాకు కళ్యాణం చేయ్యమనీ,నాకోసం ఒక రాత్రి జాగరణం చెయ్యమనీ అడగవు..
అష్టోత్తరాలు,సహస్త్రనామలు వీటికి లేవు..
“ఫలం,పుష్పం,పత్రం,తోయం… “ఇలాంటి వి కూడా కనీసం ఇవి కోరవు. ”
శ్రవణం,కీర్తనం,స్మరణం,పాద సేవనం,అర్చనం , వందనం,దాస్యం,సఖ్యం,ఆత్మ నివేదనం “అంటూ తమని కొలిచే మార్గలనూ చూపించవు.
వీటి పెళ్ళిళ్ళకూ,పుట్టిన రోజులకూ,ఎవరినో ఓడించినందుకు ఏ శెలవులు లేవు…
అయినా ఇవంటే మనకు అభిమానం
వాటిని చూడగానే తెలియని ఆనందం
రూపాయ్యల లెక్క ప్రకారం తక్కువే అయినా,ఇవి ఇచ్చే మానసిక స్థైర్యానికి మనం విలువ కట్టలేము…
వెన్ను తడుతూ నిత్యం మనల్ని ప్రోత్సహించే స్పూర్తి ప్రధాతలు.
“నేనున్నా నీకెందుకు,నా మీద భారం వెయ్యి “అని నిత్యం గీతోపదేశం చేసే ఆత్మీయులు,మన ఆత్మలో ఏకం అయిన వారు.
ఎక్కడో మన పర్సు మూలలో దాక్కున పాత రూపాయి బిళ్ళ,
రాములోరి కళ్యాణపు అక్షింతలు,ప్రతి పరీక్షలోను మంచి మార్కులు తెచ్చిచ్చే పాత పెన్ను(బోలెడు ప్లాస్టర్లు అతికించినది),
పరీక్షలప్పుడు కచ్చితం గా విషస్ చెప్పే పక్కింటి వాణీ ఆంటీ,
మనకు ఎదురోచ్చి తన వంతు దీవెననిచ్చే ఎదురింటి కుక్క పిల్లా,
మన పుస్తకాల్లో ఉండే నెమలి ఈక(పిల్లలు పెడుతుంది అన్న ఆశతో నిత్యం మనల్ని బ్రతికించేది),దానికి జతగా సరస్వతీ ఆకు,వాటికి ఆహారం గా అబ్రకం …..గట్రా.
వీటన్నిటినీ మించింది నా జీవితం లో ఒకటి ఉంది.
ఏ డ్రస్సు కుట్టినా వంక పెట్టకుండా తొడుక్కునేది
శస్త్ర చికిత్స(ఆపరేషన్) పేరుతో ఇంజెక్షను పోట్లు పడ్డది.
మట్టి,ఆకులతో చేసిన వంటలను ఏ వంకా పెట్టకుండా తినేది.
ఎన్ని సార్లు పెళ్ళి,ఎలా చేసినా మారాం చెయ్యలేదు. టీచరు గా ఎన్నో సార్లు కొట్టాను..(మా టీచరు మీద కసి ని తీర్చుకునే దాన్ని)..అయినా ఏమీ అనలేదు.
“పాపం వస్తుంది,కళ్ళు పోతాయి” అని ఏ నాడు భయపెట్టలేదు.
అదే నా చిన్నప్పటి బొమ్మ(అక్కి), దానికి చెలికాడు బాలు.
కాలాం తీసుకు వచ్చే పెను మార్పుల్లో మొదటిగా చెప్పేది..మన వయసు పెరగడం…ఈ మార్పునే నేను గాయం అంటాను
ఈ గాయానికి నేనూ అతీతురాలిని కాలేక పోయాను.
నా చిన్నారి దేవుళ్ళటో మనసారా మాట్లాడి ఎన్నాళ్ళు అయ్యిందో?
వీటికి తలారా స్నానం చెయ్యించి,కొత్త బట్ట కట్టి ఎన్నాళ్ళు అయ్యిందో?
అయినా నా నుంచీ ఎదీ ఆశించని మహోన్నతులు .
ప్రతి నిత్యం అల్లంత దూరం నుంచి నన్ను ఆశీర్వదించే దేవదేవుళ్ళు .
నన్ను నన్ను గా అర్ధం చేసుకున్న మహాను భావులు…… నా చిన్నరి దేవుళ్ళు……