“సావిత్రీ!!ఎన్ని సార్లు చెప్పాలి,ఆఫీసుకు మాటి మాటికీ ఫోను చెయ్యద్దని….”
అమ్మా… నేను… నేను… అంటూ ఫోను అందుకోవడం మా వాడు చేసే ప్రయత్నాలు చక్కగా వినిపిస్తున్నాయి.
“ఈ రోజే ఆఖరు లేండి.రేపటి నుంచీ ఎటూ స్కూళ్ళు “అంటూ మా వాడికి ఫోను అందించిందీ.
“నాన్నా పొద్దున ఎక్కడికి వెళ్ళావ్,నేను లేచినప్పుడు లేవు…”
. ఈ ప్రశ్న కు ఏమని చెప్తే ఆ చిన్న మనసు సమాధానపడుతుంది.
“కన్నా..నీకు కొత్త పుస్తాకాలు తెచ్చా,చూసుకున్నావా…”
“నానా..పెన్ను తీసుకురాలేదే,నిన్న తెస్తానని అన్నావ్”అంటూ సూటిగా విషయానికి వచ్చాడు.
“ఈ రోజు తప్పకుండా తెస్తా కన్నా…”అంటూ ఫోను పెట్టేసా.
దూరం ఊగుతున్న క్యాలెండరు మీద నా దృష్టి పారింది.
జూన్ 12: దాదాపు అటూ ఇటు గా స్కూళ్ళు తెరిచే రోజు..కొన్ని రోజులుపాటూ నేస్తాలతో ఏర్పడిన విరహం తీరబోతున్న రోజు.శెలవల్లో చేసిన పనులన్నీ రాశులుగా చెప్పే రోజు.ఇలాంటి ఎన్నో జూన్ 12లు గడిచినా, రెండు దశాబ్దాల నాటి జూన్ 12 కు మాత్రం నా జీవితం లో ప్రత్యేకత ఉంది.
*************************************************************************************************
త్వరగా లేరా……” అన్న అమ్మ కేక తో ఉల్లిక్కిపడి లేచాను.
ఈ రోజు నుంచీ స్కూలు మొదలు.
కొత్త డ్రస్సు,కొత్త పుస్తకాలు.తలచుకుంటుంటేనే ఎలానో ఉంది.గబ గబా తయారు అవ్వాలి. పైగా ఈ రోజు మా ప్రోగెస్సు కార్డు కూడా ఇస్తారు.అదీ మా స్కూల్లో అందరిముందూ,మా హెడ్డు మిస్సు చేతుల మీదుగా.
ఆయినా చిన్న బాధ.ఈ సారి వంశీ గాడు,ఏం చెసాడొ,ఎలా చదివడో గనీ నాతో పాటు 1స్త్ రాంక్ కొట్టేశాడు.ఒక్క మార్కు తక్కువరాకూడదు.వాడి తస్సదియ్య!!
నా చప్పట్లలలొ సగం వాడివి.ప్రతి టీచరు దగ్గర నాక్కున్న పేరు లో సగం వాడిది.
దేవుడా!! కరెంటు కోత అంటారు.పరీక్షలప్పుడు వాళ్ళ వీధిలొ తీయకూడదా.ఇక వాడి బడాయి చూడతరమా ఇక,నన్ను నా గాంగ్ ను వాడు ఎలా చూస్తాడొ??
స్కూల్ కు రాగానె అస్సెంబ్లీ లొ మా ఇద్దరినీ పిలిచ్చి ప్రొగ్రెస్సు కార్డ్ ఇచ్చారు.వాడి పక్కన నుంచోవాలంటేనె ఎలానో ఉంది.ఎవరికీ కనిపించకుండా వాడిని పక్కకుతొశా.వాడు అంతే ఉత్సాహం తో నన్ను తోశాడు.ఈ తొపులాట అనంతరం,చప్పట్ల మధ్య కొత్త క్లాసు లొ అడుగుపెట్టాం.
కొత్త బాగ్,కొత్త బుక్స్,కొత్త కంపస్స్ బాక్స్,అన్నీ కొత్తవె.కానీ…ఒక్కటే వెలితి…… పెన్ను.పెన్సిల్ తో రాయడం ఈ సంవత్సరం కూడ తప్పదురా దెవుడా అంటూ రాయడం మొదలుపెట్టా
ఏమైందొ ఏమో..పోయిన క్లాస్స్ నా పక్కన కూర్చున్న వాసు గాడు వంశీ గాడి పక్కన చెరాడు.వాడు ఉంటె అప్పుడప్పు టీచరు చెప్పిన ఇంపార్టంట్ ప్రశ్నలు స్టార్ మార్క్కు పెట్టడానికి పెన్ను ఇచ్చేవాడు.ఇక ఆ పని కూడా పెన్సిల్ తొనే చెయ్యాలి
మెల్లెగా నా కంచుకోట కదులుతోంది.నాతో పాటు తిరిగిన వాళ్ళు మెల్లెగా వంశీ జట్టు కట్టేస్తున్నారు.ఇంగ్లీషు నోటూ బుక్కు లొ బెస్ట్ ఫ్రెండు గా నీ పేరు రాస్తా అని ఆశ చూపినా ఎవరు రావట్లేదు.ఏంటీ కారణం అని మెల్లెగా ఆరతీస్తే అప్పుడు అర్ధం అయ్యింది.వంశి గాడు అదెదో “జెట్టర్ పెన్ను “ అట ,మా నాన్న ఇచ్చాడు అంటూ క్లాసు కు తెచ్చాదు.అడిగితే పేరు రాసుకొనిస్తున్నాడు అట.తస్సగొయ్యా !! ఇదా అసలు సంగతి.
మా నాన్న జేబులో ఉన్న ఫౌంటైన్ పెన్ను కన్నా నా.వీళ్ళకేమి తెలుసు ఫౌంటైన్ పెన్ అంటే.ఎవడో ఏదో జెట్టర్ పెన్ అంటే ,వాడి వెనక పడ్డారు వెర్రి గొర్రెలు!!!
ఇక నేను ఆ ఫౌంటైన్ పెన్ను తెచ్చానంటేనా…..టీచరు కూడా నన్నే చాకు పీసు తీసుకు రమ్మని ,నన్నే మట్లాడె వాళ్ళ పేర్లు బోర్డు మీద రాయమని చెప్పల్సిందే.
ఆ ఫౌంటైన్ పెన్ను ముందు ఈ వెధవ జెట్టర్ పెన్ను ఎంత.దాని పాళీ అంత ఖరీడు చెయ్యదునేను ఇంత కాలం దాని మీద దృష్టిపెట్టి అడగలేదు కాని,లేక పొతే నాన్న అడగంగానే నాకు ఇవ్వరాఈ ఆలొచనల్తోనే..నా మొదటి రోజు ముగిసింది.
ఇంటికి రాగనే అందరికీ నా ప్రోగ్రెస్సు కార్డ్ చూపించా.నాన్న కొసం కొత్త పుస్తకాలు ముందు వేసుకొని ఎదురుచూస్తున్న
నాన్న వచ్చీ రాగనే నా ప్రోగ్రెస్సు కార్డ్ చూపించా.ప్రతి సారి “ఏమైనా కొనుక్కొ” అంటు నాలుగు రూపాయలు పెట్టే నాన్న ఈ సారి మాత్రం ఎమీ మాట్లాడ లేదు.
ఏమోలే ఆఫీసు లో ఎమైనా గొడవలేమొ.రెప్పొద్దున నేనే అడిగెస్తా ఒక్క సారి మీ పెన్ను స్కూల్ కు తీసుకెళతా అని.
తెల్లారింది.నేను అదుగుదామని వెళ్ళే లోపే,సాయంత్రం లేటు గా వస్తా,నా కోసం ఎదురు చూడకుండా భొజనం చేసి పడుకోండి అర్గెంటు పని ఉంది అంటూ వెళ్ళి పొయారు.
ఈ రోజు కాక పొతే రేపు అడుగుతాలే అంటూ స్కూల్ కు సిద్ధం అయ్యా.మెల్లెగా అమ్మ చెవిలో నాకు పెన్ను కావాలి అన్న సంగతి చెప్పేశా“ఒరేయి! పెన్సిల్ తో రాస్తేనే రాత కుదురుతుంది రా.అప్పుడే నీకు పెన్ను ఎందుకు.మా అప్పుడు కాలేజి లో చది వే వాళ్ళు తప్ప పెన్ను ఉపయొగించే వాళ్ళు కాదు.ఎటూ వచ్చే ఏడు హై స్కూల్ కు వస్తావ్ గా అప్పుడు కొనిపెడతాలే” అంది
“అది కాదమ్మా!!వంశీ గాడు పెన్ను తెచ్చి నా దోస్తులందరినీ తన వైపు తిప్పుకుంటున్నాడు” అన్నా వినకుండ నన్ను స్కూల్ కు తోసేసింది
ఇక లాభం లేదు.రాత్రి బామ్మ కు చెప్పాల్సిందె.పద్యం అప్ప చెప్ప గానే ముద్దు పెట్టేటప్పుడు అడుగుతా.కాదనదు.
మళ్ళీ క్లాస్స్ లొ అదె గోల.అంతా ఆ వంశి గాడి పెన్ను గురించే మట్లాడుతున్నారు.ఒక రోజంతా వాడితో తిరిగెవాళ్ళకు పూర్తి ప్రశ్న రాసుకోవడానికి ఆ పెన్ను ఇస్తున్నాడు అట.చెత్తగా రాసే వాడి రాత కూడ ఆ పెన్ను తో రాస్తే భలే ఉంటుంది అట.ఇంకా ఏంటెంటొ చెప్ప్తున్నారు.అదీ నాకు వినపడేలాగా…
ఏ మాటకు ఆ మాట చెప్పాలి.ఈ జెట్టర్ పెన్ను కూడా బాగనే ఉంది.నాన్న పెన్ను లాగా సిరా కారదట.అప్పుడే నలుగు పెట్టి స్నానం చేసినట్టు,చక్కగా నునుపు దేరి ఉంటుంది .
బామ్మ పాడుతూ చెప్పే రాముల వారి రంగు.ఆకశం రంగులొ ఉన్న రాముడు ఎం బాగుంటాడు అనుకునే నాకు అప్పుడు కాని అర్ధం కాలేదు రాముడి అందం.అబ్బా…..ఎందుకు నా ఈ జామ పండు రంగు.చక్కగా నీలి రంగులొ నిగ నిగ లాడొచ్చు అని అనుకున్నా.
ఇక దీని చిన్ని కాపు చూడాలి,అచ్చు వజ్రాల కిరీటం లాగా ఉంది.వెండి మొలతాడు కట్టినట్టు ఉన్న నడుము.ఇంకా కిందికి దిగితే ఇక దీని పాళీ…అచ్చు ఉలి లాగా ఉంది.దీని తో చెక్కితే అక్షరాలు కూడ ఎల్లొరా శిల్పాలు అవ్వవా…..?
రాత్రి మెల్లగా బామ్మ పక్కన చేరా.ఎలాగో కష్టపడి “ఎవ్వని చే జనించు” పద్యం అప్పచెప్పేసి,కాళ్ళు ఆమె మీద వెసి మెల్లెగా నా పెన్ను సంగతి చెప్ప.”పెన్ను కేమి భాగ్యం రా పిచ్చీ తండ్రీ!!మీ తాతయ్య ఉంటేనా….ఆ వైభోగం అంతా అప్పుడే నాయనా…అంతా ఆయనతోనే పోయింది…..మహరాజు..ఏ లోకాన ఉన్నాడొ…..” అంటు కళ్ళు అద్దుకుంది.ఇది ఇప్పట్లొ ముగిసే లాగా లేదు అని గట్టి గా కళ్ళు మూసుకొని పడుకున్నా.
తెల్లరి మెల్లెగా నాన్నను పెన్ను విషయమై కదిపా…” పెన్సిలు సరిగ్గ పట్టుకోవడం రాని చితక వెధవ్వి…అప్పుడే పెన్నా….” అంటూ వెళ్ళి పోయారు.
మెల్లెగా నాలొ కసి పెరిగింది.ఎలగైనా వంశి గాడికి తాత లాంటి పెన్ను తెచుకోవాలి అన్న తపన హెచ్చింది.దెవుడి ప్రార్ధనలొ జీళ్ళు,గోళీలు,రబ్బరు ఉన్న పెన్సిల్ ను వెనకకు తోస్తూ ఈ జెట్టర్ పెన్ను ముందుకు వచ్చింది.ఆ పెన్ను ముందు అంతా త్రుణ ప్రాయం గా కనిపించారు.పెన్ను సంపాదించలేని నా ఈ బ్రతుకు ఎందుకు అనిపించింది.రాత్రీ పగలూ ఆ పెన్ను గురించే ధ్యాస.కలలో కూడా పెన్నే కనిపిస్తోంది.
ఎలా పెన్ను సంపాదించడం…..కొనాలి ….అంటె….అమ్మను అడిగితే “ఈ సారి బోనస్ కు చూద్దం” అంటుంది
అమ్మో అప్పటి వరకూ ఆగితే…నా స్థితేం గాను.ఇప్పటికే క్లాస్సు లో సగం మంది కి పైగా వంశీ జట్టు కట్టరు.బొనస్ వచెటప్పటికి పూర్తి క్లాస్సు అంతా వాడి పక్షాన చేరి,నా క్లస్సు లీడరు పదవికి ఎసరు పెడతారు.
కొట్టెస్తే???? అమ్మో టీచరుకు తెలిస్తే చావ బాదుతుందివాడినే అడిగితే???అమ్మో నా పరువేం గాను
ఇక ఎలా…..చట్టుక్కున తట్టింది..…..మెల్లెగా వాడి తో నేను దోస్తీ కట్టి,వాడి పెన్ను తీసుకోని,శివధన్నుసుని ఎక్కుపెట్టి విరిచినట్టు విరిచేస్తా..అప్పుడు గాని వాడి పొగరు పోదు.
లేక పొతే…. నాకు పెన్ను చూపిస్తూ రాస్తాడ,టీచర్కు కూడా ఆ పెన్ను ఇస్తాడా……???ఇదె నా తక్షణ కర్తవ్యం అంటూ..ఒక ఆదివరం వాడి ఇంటికి ,క్రికెట్టు ఆడుకుందమా అని బయలుదెరా.
శెలవు రోజు కావడం తో వంశీ వాళ్ళ నాన్నగారు ఇంట్లొనే ఉన్నారు.”ఈయనే కదా వాడి బడాయికి కారణం.మా నాన్న లాగా వచే ఏడు కొనకూడదా వాడికి పెన్నువీడి బాడాయి చూడండి ”
స్కూల్ లేని రోజు కూడా జేబులొ పెన్ను పెట్టుకోని ఇల్లంతా నా ముందు తిరుగుతాడా…
ఒక్క సారి క్లాస్స్ 1స్ట్ రాగనే ఇలా పెన్నులూ గిన్నులూ కొనేయ్యడమేనా..?అదేదో పెద్ద పెన్సిల్ లో,వెనక రబ్బర్ ఉన్నది కొనచ్చు కదా…?
పెన్ను కొన్నారు పో..అలా స్కూల్ కు ఇవ్వడమేనా…?
ఇచ్చారు పో…ఎవరూ చూడకుండా నువ్వు ఒక్కడివే రాసుకో అని చెప్పకూడదా….??
ఎవరైనా చూసి అడిగారు పో…మా ఇంట్లొ ఇవ్వొద్దు అన్నారు అని వీడు చెప్పకూడదా…??
బామ్మ అన్నట్టు “ఇప్పటి నుంచీ పిల్లకు ఇలా సుఖలని అలవాటు చెయొచ్చా..?? పిల్లల్ని ఇలాగెనా పెంచడం…?
ఒక్క సారి ఆ పెన్ను నా చెతిలోకి వస్తేనా..సూర్ప్పణక ముక్కు చెవులు కోసినట్టు ఆ పెన్ను ను సగం కొసెద్దును, క్లాస్స్ అంతా మళ్ళి నా చుట్టే చేరరా.నా పక్కన కూర్చొడానికి పొటీ పడరా..?? ” అని గట్టిగా కళ్ళు మూసుకొని అడిగేసి ,వెనక్కి తిరిగి చూడకుండా పారిపొదాం అనుకున్నా.
అంతలో వంశి వాళ్ళ అమ్మ ప్లేటు లో బిస్కుత్తులు పెట్టుకొని నా దగ్గరికి వచ్చి “నీకు, మా అబ్బాయికి ఇద్దరికి 1స్ట్ రాంక్ వచ్చిందట కదా.అది తెలిసే అంకులు నీకు ఒక పెన్ను కొన్నారు.ఈ సాయంత్రం మీ ఇంటికి వచ్చి నీకు ఇచ్చేద్దాం అనుకున్నాం.అంత లో నువ్వే వచ్చావ్.” అంటూ ఒక పెన్ను నా చేతిలొ పెట్టింది.
క్షణకాలం పాటూ ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు..
******************************************************************************
ఙ్ఞాపకాల దోంతరల్లో ప్రపంచాన్ని మరచి జోగుతున్న నేను ఫోను మోతతో ఉల్లిక్కి పడి లేచా.
“నాన్నా..పెన్ను కొన్నవా?”అంటూ మా వాడి ఫోను.
శెలవుపెట్టి మరీ పెన్నులు కొనడానికి బయలుదేరా.ఒకటి మావాడికి,ఒకటి నా వంశీ కి, ఇద్దరి కళ్ళల్లో కనిపించే ఆనందాన్ని ఆశ్వాదిస్తూ….