శ్రమ ఏవ జయతే

అప్పుడే తెల్లారింది.
 
రాత్రి భోజనం చెయ్యలేదేమో సాహెబ్ మొహం బాగా అలసి పోయింది
రాత్రి పెద్ద యుద్ధమే జరిగింది మా చిన్న సాహెబ్ తో

నా వల్ల రాబడి తగ్గింది కాబట్టి అమ్మెయ్యమంటాడు చిన్న సాహెబ్.
నాకు జీవితానిచ్చిన అమ్మని అమ్మలేనని అంటాడు బాషా సాహెబ్
దీన్ని వారసత్వం గా తీసుకోలేనంటాడు చిన్న సాహెబ్.దీనితో తన కొత్త జీవితాన్ని ప్రారంభించనంటాడు.

బాషా సాహెబ్ మాత్రం కొంత కాలం అనుభవం గడిస్తే తప్ప తన సంస్థను అప్పజెప్పనంటాడు.  

ఇలా రాత్రి చాలా వేడిగానే సాగింది వాళ్ళిద్దరి మాట తీరు.ఇది చాలా రోజుల నుంచీ సాగుతున్నదే.నిన్న రాత్రి పరాకాష్టకి చేరుకున్నట్టుంది. 
నాకెప్పుడు నిద్ర పట్టిందో తెలియదు,తెల్లారి చూస్తే నా వడిలో బాషా సాహెబ్ నిద్రపోతున్నాడు
నేను తనకు జీవితాన్ని ఇచ్చిన మాట సంగతేమిటో కానీ,బాషా సాహెబ్ రాక మాత్రం నాకు జీవితం లో ఎన్నో కోణాలని చూపించింది.వెయ్యి ఏళ్ళకు సరిపడా జీవితానుభవం నేర్పించింది
 
అన్నింటికీ మించి ప్రేమిచడం నేర్పింది,ప్రేమించబడడం లో ఆనందాన్ని తెలియచెప్పింది.
జీవితపు తీపిని చూపించింది కష్టపడి పని చేయగా కలిగిన విజయం లో ఆ తీపి లో రెట్టింపు  మాధుర్యాన్ని అనుభవింపచేసింది.
 ఈ తత్వం ఎలాంటి ఉన్నత శిఖరాలకు తీసుకేళుతుందో ప్రత్యక్షం గా నాకు చూపించింది.అందులో నన్ను భాగస్వామ్యురాలిని చేసింది  
****************************
దాదాపు పాతికేళ్ళ కిందటి మాట
మూడు కాళ్ళా ముద్దుగుమ్మగా ఎంతో మంది మేధావుల సృష్టిని నేను

ఊహ తెలిసింది మాత్రం ఖాన్ సాహెబ్ దగ్గరే
పొద్దునే స్నానం చెయ్యించేవాడు ఖాన్ సాహెబ్ 
ప్రతి శుక్రవారం మసీదు లో నాకు ప్రత్యేక ధూపం వెయ్యించే వాడు
ప్రతి రోజు రాజేంద్ర నగరు నుంచీ మెహదీపట్నం వరకు మా ఇద్దరి ప్రయాణం.దాదాపు ముప్పావు గంట సేపు.

ఖాన్ సాహెబ్ మనసు నాకు మెల్లెగా అర్ధమవుతున్న తరుణం లో ఖాన్ సాహెబ్ కి తీవ్ర అనారోగ్యం వచ్చింది
తనలాగే చూసుకునే వాళ్ళకోసం తీవ్రం గా అన్వేషణ మొదలు పెట్టాడు.

ఒక డ్రైవరు గా కన్నా ఖాన్ సాహెబ్ నాకు ఒక వ్యక్తిగా ఎక్కువ ఇష్టం
చేసే పని పట్ల నిజాయితీ,నిబద్ధత ప్రతి క్షణం కనిపించేది.

అదే తత్వం నన్ను చాలా కాలం ఎవరికీ అమ్మనివ్వకుండా ఆపింది.వచ్చే గిరాకీల్లో ఏదో ప్రత్యేకమైనది చూసేవాడు.ఏదో అసంతృప్తి తో బేరం వదులుకునే వాడు

సంక్రాంతి పండుగ రోజులవి.ఆ రోజు ఖాన్ సాహెబ్, నేను రాజేంద్ర నగర్ లో మా దినచర్య మొదలు పెట్టాము.

ప్రతి రోజూ మొదటి బోణీ చేసే పోచమ్మ ఆ రోజు కొత్తగా కనిపించింది.పంట చేతికందిందేమో, తాకట్టు నుంచీ విడిపించుకున్న నగలతో మెరిసి పోతోంది.ఆరు పదులు దాటినా ఎవరిమీద ఆధార పడని పోచమ్మ అంటే మా సాహెబ్ కి ఎంతో గౌరవం.  

మెల్లెగా నేను ప్రయాణం సాగిస్తున్నాను.సుమారు పాతికేళ్ళ వయసున్న బక్క పల్చని కుర్రాడు నన్ను ఆపాడు.ఏదో తెలియని నిరాశ స్పష్టం గా కనిపిస్తోంది.ఎక్కడో అన్యాయాన్ని ఎదుర్కున్నట్టు ఉన్నాడు. బస్తీకి కొత్తేమో.ఇక్కడ ఇవి సహజమని తెలియదనుకుంటాను పాపం

అతన్ని చూడగానే తెలియని ఆత్మీయత నాలో పొంగింది.అక్కున చేర్చుకుని ఓదార్చాలనుకున్నాను.ఇక్కడి మనుషుల గురించి మొత్తం చెప్పెయ్యాలనుకున్నాను.కానీ నాకు మనుషుల లాగా చెప్పడం రాదే! నాకు తెలిసినదల్లా నన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరినీ సుఖం గా వాళ్ళ గమ్య స్థానాలకి చేర్చడం మాత్రమే! 

ఖాన్ సాహెబ్ కిక్కు ఇవ్వడం తో నేను మళ్ళి నా ప్రయాణాన్ని సాగించాను.దూరం గా నల్లభై ఏళ్ళ నిండు వ్యక్తి.సూటూ బూటు లో ఉన్నాడు.ఈ తీరు వాళ్ళంతా సాధారణం గా అందరితో కలిసి ప్రయాణించడానికి   ఇష్టపడరు.మీటరుకి ఇంకాస్త ఎక్కువ ముట్టజెప్పి అందరినీ దిగబెట్టమని డ్రైవరుతో ఒప్పందం కుదుర్చుకుంటారు
 
అంతా చేరాల్సింది ఒకటే చోటికన్నప్పుడు మార్గ మధ్యం లో ఈ తేడాలు ఏంటి అని మా ఖాన్ సాహెబ్ ఇలాంటివి అస్సలు ప్రోత్సహించేవాడు కాదు.

పక్కన దెబ్బతిన్న కారుని చూసి, ఖాన్ సాహెబ్ ఆ వ్యక్తిని ఎక్కించుకున్నాడు.
గమ్మత్తుగా ఆ వ్యక్తి ఎలాంటి బేషజాలు లేకుండా కూర్చున్నాడు.
నా అంతరంగం సాహెబ్ కి అర్ధమయ్యిందనుకుంటాను,వెంటనే ఇదే విషయాన్ని అడిగేసాడు

” అదేంటి సాహెబ్ అలా అడిగావు,నేనూ మనిషినే,వీళ్ళూ మనుషులే కదా,వీళ్ళ పక్కన కూర్చోవడానికి అభ్యంతరం దేనికి ”

“మీరు బాగా ఉన్నోళ్ళు కదా బాబయ్య ” అని జంకుతూ అందుకుంది పోచమ్మ

“అమ్మా!రెక్కలే మనకు చుట్టాలు కదమ్మా.మరి ఇందులో ఉన్నోడూ,లేనోడూ ఏంటమ్మా!”

ఈ మాటలు విన్న నాకు ఎంతో ఆనందం వేసింది.

“కడుపు నిండింది కాబట్టి మీరు ఎన్ని మాటలైనా మాట్లడతారు లేండి సార్! అవసరం మీది కాబట్టి మా పక్కన కూర్చున్నారు గానీ ” కోపం గా అందుకున్నాడు ఆ యువకుడు

“అంత కోపమెందుకొయి! నేనూ ఈ మట్టిలో పుట్టిన వాడినే.నాకు కష్టం సుఖం తెలుసోయ్”
 
“ఊరుకోండి సార్!ఇక్కడ ఇలానే మాట్లడతారు,మా లాంటి వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం చేతులు ముడుచుకుంటారు .

అడిగేవాడికి చెప్పేవాడు లోకువని,ప్రతి ఇంటర్వ్యూ లో ఏవేవో ప్రశ్నలడుగుతారు.మీకు నిజం గా ఉద్యోగం ఇచ్చే ఉద్దేశ్యం ఉండదు సార్.ఇది వరకే అమ్ముడు పోయుంటారు సార్.మీరంతా ఇంతే సార్” అని ఆవేశం గా తన బాధను మొత్తం వెళ్ళగక్కాడు

 

“అబ్బాయి!బాగా ఆవేశం లో ఉన్నావు..ఎక్కడ తప్పు జరుగుతోందో తెలుసుకో.మళ్ళీ ప్రయత్నించు ” అని చెప్పుకొస్తున్నాడు ఆ వ్యక్తి

“మూడేళ్ళనుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నాను సార్!నాకు ఉద్యోగం వస్తుందని,వాళ్ళకి మూడు పూటలా భోజనం పెడతానని ఉన్న పొలాన్ని అమ్మేసారు సార్ మా వాళ్ళు! 
 
బస్తి ఉద్యోగం లో కష్టం తక్కువని, ఉన్న ఊరిని వదిలి వచ్చాను సార్! ” అని కనీళ్ళు పెట్టుకున్నాడు ఆ యువకుడు

“మా ఊళ్ళో డిగ్రీ పూర్తి చేసిన మొదటి వ్యక్తి నేనే సార్! ఇక్కడికి వచ్చాక అర్ధమైంది సార్ మా ఊరి తెలివితేటలు ఎక్కడా పనికిరావని. కూర్చుని చేసే ఉద్యోగం చేస్తానని మా ఊరంతా నా మీద ఆశలు పెట్టుకుంది. మళ్ళీ తిరిగి మా ఊరికి వెళదాం అంటే అభిమానం అడ్డొస్తోంది సార్! ” అని చెప్పుకొస్తున్నాడు యువకుడు

“బాబూ! మేము ప్రతి ఇంటర్వ్యూ లో చూసేది ఒక్కటే.ఒక విషయాన్ని మీరు యే విధం గా అర్ధం చేసుకున్నారు అన్నదే,మీ వల్ల మా సంస్థకు  ఎంత వరకు లాభం అని మాత్రమే.ఆ కొన్ని నిమిషాలలో మీరు ఇది నిరూపించుకుంటే చాలు ” అని చెప్పాడు ఆ వ్యక్తి.

“మీ తరం వాళ్ళంతా కష్టపడి పని చెయ్యగలరు. సరైన దిశానిర్దేసం లేకనే నిరుద్యోగ సమస్య ఇంకా మన దేశాన్ని వెన్నాడుతోంది . ఎవరో నీకు ఉపాధి కల్పిస్తారని ఎదురుచూసేబదులు,నువ్వే నీ లాంటి పది మందికి ఎందుకు జీవితాన్ని ఇవ్వకూడదు ?
 

“అబ్బయ్యా….2 రూపాయలో నేను పూల వ్యాపరం మొదలు పెట్టినా.ఇద్దరు కొడుకులనీ సర్కారీ నౌకరీ వచ్చేంత వరకు సాకినా. కాలుమింద కాలేసుకుని తిందామని ఆశపడినా.ఈ రెక్కలు సుఖపడడం ఆ దేవుడికి ఇష్టం లేదేమో. ఇద్దరు బిడ్డలూ పాపపు సొమ్ముకి అలవాటు పడినారు.

పరుల సొమ్ము వద్దని ఎన్నో సార్లు జెప్పినా. ఒకడి కడుపు గొట్టి తినే కూడు అరగలేదు. మళ్ళీ నా పూల వ్యాపారానికి వచ్చేసినా. నేను రోజూ తినే మెతుకులు ఎవరి దగ్గరా అన్యాయం గా సంపాదించినది గాదు.ఆ సంతోసం తోనే బతుకీడుస్తున్నా ” అని పోచమ్మ తన గోడు చెప్పుకొచ్చింది  

“చెప్పడానికి బాగానే ఉంటాయి సార్ ఇలాంటి మాటలు,నా మీద నమ్మకం తో పెట్టుబడి పెట్టేది ఎవరు సార్,ఇన్ని మాటలు చెప్పిన మీరు పెడతారా? ” అన్నాడు యువకుడు

“తప్పకుండా నువ్వు కష్టపడతావ్ అని నిరూపించుకో ,నీ మీద పెట్టుబడి నేను పెడతాను ,ఎలా నిరూపించుకుంటావ్ అన్నది నీకే వదిలేస్తున్నా” అని సవాల్ విసిరాడు ఆ వ్యక్తి.దిగబోతూ తన పేరూ,అడ్రస్సు ఆ యువకుడి చేతిలో పెట్టి మరీ వెళ్ళిపోయాడు.

నాకు ప్రయాణమూ కొత్త కాదు,ప్రయాణీకులూ కొత్త కాదు.ఇలాంటి రోజు మాత్రం ఎప్పుడూ నా అనుభవం లో రాలేదు .

పోచమ్మ దిగాల్సిన సమయం వచ్చేసింది. “అబ్బయ్యా! నీ అంత సదువుకున్న దాన్ని గాదు.నిషానీ దాన్ని నేను సెప్తున్నా అనుకోనంటే ఒక్క మాట సెప్తాను. ప్రతి పనిలో కష్టం ,సుఖం రెండూ ఉంటాయి.ఒకటి లేక పోతే రెండో దాని ఇలువ తెలియదు.
రేపు ఎంత సంపాదించినా,ఎంత ఎత్తుకెదిగినా ఎక్కడ మాత్రం పక్కనోల్ల సొమ్ముక్కి ఆశపడద్దు.మొదటి ముద్ద తినే ముందు ఈ మాట ఆలోచించు” అని పోచమ్మ చెప్పి దిగేసింది

నాలో ఎన్నో ఆలోచనలను మొదలయ్యాయి.ఎలాగో అలా రోజుని గడిపే నాకు ఈ రోజు కొత్త ఊతపిరి పోసింది.

“ఎక్కడ దిగాలి అబ్బయ్యా” అంటూ  ఖాన్ సాహెబ్ నిశబ్దాన్ని ఛేదించాడు

“తెలియదు సాహెబ్”

“మరి ఎక్కడికి వెళ్దామని ఎక్కావ్ ?”

“ఏమో సాహెబ్ గుర్తులేదు.నీకు తెలిసిన ఏదైనా పని దగ్గర  దిగబెట్టు సాహెబ్”

“సదువుకున్నాల్లకి ఇప్పించే పని నాకేమి తెలుసు అబ్బయ్యా”

“కూలీ పని అయినా చేస్తాను సాహెబ్  “                         

“పేనా బట్టుకునే సేతులు,పార బట్టలేవు అబ్బయ్యా”

“తప్పదు సాహెబ్,నా రోజు గడవాలి అంటే తప్పదు”

“నా కాడ ఒక పని ఉంది అబ్బయ్యా,నీ సదువికి మాత్రం తగినది కాదు.నువ్వు సేత్తా అంటే ……”

“తప్పకుండా చేస్తాను సాహెబ్,అన్యాయం కానిది అంటే తప్పకుండా చేస్తాను” అంటూ ఉత్సాహం గా అందుకున్నాడు ఆ యువకుడు

“ఈ నా బేటీనీ తిప్పాల.వచ్చిన దానిలో ఇద్దరికీ సగం సగం” అని నన్నూ చూపిస్తూ అన్నాడు సాహెబ్

నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పిన రోజది.ఖాన్ సాహెబ్ చేతి నుంచీ బాషా సాహెబ్ చేతికి మారిన రోజది

చాలా త్వరగా బాషా సాహెబ్ నన్ను మచ్చిక చేసుకున్నాడు.ఖాన్ సాహెబ్ కి గురి కుదిరింది బాషా సాహెబ్ మీద.పక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నన్ను ఒంటరిగా బాష సాహెబ్ దగ్గర వదిలి పెట్టి పోయేవాడు

మెల్లెగా ఖాన్ సాహెబ్ ఆరోగ్యం మరింత క్షీణించింది.చూపూ మందగించింది.నన్ను ఇదివరకటిలాగా చూసుకోలేక పోతున్నాననే బెంగ ఎక్కువ అయ్యింది

బేగం సాహిబాను అత్తగారింట్లో దిగపెట్టి నట్టు నన్ను ఎన్నో జాగ్రత్తలు చెప్పి,కన్నీళ్ళాతో  బాషా సాహెబ్ కి  అప్పగించాడు
 
అప్పుడప్పుడు వచ్చి నన్ను పూలతో అలంకరించి చూసుకుని పోయేవాడు ఖాన్ సాహెబ్

బాష సాహెబ్ తో కలిసిపోవడానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు. మా ఇద్దరి మనస్తత్వం దాదాపు ఒకేలా ఉండడం తో ఒకరి మనసు ఒకరికి చాలా త్వరగా అర్ధం అయ్యింది

బాష సాహెబ్ కి పని పట్ల ఎంతో నిబద్ధతతో పాటు,తనలాంటి ఎంతో మదికి ఉపాధి కల్పించాలి అన్న ఉద్దేశ్యం ఉండేది.

అదే ఆశయం గా మారి రాత్రీపగళ్ళు కష్టపడేలా చేసింది.
బస్తీ లో ఒక ప్రముఖ ఆటో సంస్థ అధినేత గా ఎదిగినా,తన దిన చర్య మాత్రం నాతోనే ప్రారంభించేవాడు

ప్రతి రాత్రీ తాను ఆ రోజు చేసినవ్వన్నీ నాతో చెప్పుకునేవాడు
మనసు భారం గా ఉన్న రోజు నాతో కలిసి నిద్రపోయేవాడు

మా అనుభంధం చాలా విచిత్రం గా అనిపించేది నా తోటి ఆటోలకు.
నాకే ఆశ్చర్యం గా ఉంటుంది.ఎక్కడి నేను,ఎక్కడి సాహెబ్ అని.

********
చల్లటి నీళ్ళు కాళ్ళ మీద పడ్డాయి.
చోటా సాహెబ్ నా టైర్లను కడుగుతున్నాడు
ఏదో పశ్చాతాపం కళ్ళల్లో స్పష్టం గా కనిపిస్తోంది
నాకూ దుఖం పొంగుకొచ్చింది.బిడ్డ రాత్రంతా ఎంత బాధ పడ్డాడో!

నన్ను మొదటి సారి అధిరోహించిన తన్మయత్వం లో ముందుకు  సాగుతున్నాడు చోటా సాహెబ్.
“శతమానం భవతి” అని మనస్పూర్తిగా ఆశీర్వదిస్తూ నేనూ సాగిపోతున్నా……
 
 
 

 

 

 

 

 

 

 
 
 

 

  

 
 
  
 
 
 
 
 
 
 

 

Published in: on ఏప్రిల్ 20, 2008 at 4:19 ఉద.  17 వ్యాఖ్యలు  

తెల్ల కాగితం

“అమ్మా!!మీ కోసం ఎవరో వచ్చారు..” అంటూ బోసు కబురు మోసుకొచ్చాడు
నాకోసం ఎవరో రావడం ఏంటీ ?
అదీ ఇంత తుఫానులో……..

ఎవరై ఉంటారబ్బా…?
వయసు ఉడిగిపోయిన నాకోసం వెదుక్కుంటూ వచ్చేవారెవరు…?అనుకుంటూ వడి వడిగా బోసు వెనాకాలే నడక సాగించా.
 
ఎదురుగా ఎవరూ లేరు

3 రోజులనుంచీ ఏకధాటిగా వర్షం కురవడం తో మా ఆశ్రమం అంతా ముసురు లో ముసుగేసింది.ఎప్పుడూ ఏవో లెక్కలు రాసుకుంటూ ముందటి వరండాలో నిండుగా ఉండే సుబ్బయ్య కూడా శెలవు పెట్టాడు.

జాతీయదినోత్సవాలలో తనలో ‘మనీ’ ని పక్కన పెట్టే మనుషులే తప్ప ,మామూలురోజుల్లో పెద్ద అలికిడి ఉండదు  మా ఆశ్రమం లో.

అప్పుడప్పుడు సావిత్రమ్మ మనవడు పరీక్షలకు ముందస్తు తయారిలో భాగం గా రాసే ఉత్తరం తప్ప ,బయటి నుంచీ మాకొచ్చేవి ఏవీ లేవు.
    
“ఉండండమ్మా  ఆయన ఎక్కడికి పోయాడొ కనుక్కొస్తా”అంటూ నన్ను వరండాలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు బోసు.
ఎవరై ఉంటారబ్బా……ఇంత అర్థరాత్రి,వర్షం లో ,అదీ నా కోసం…….?

“అమ్మా!!!!” అన్న బోసు పిలుపుతో ఉల్లికిపడ్డ నా ఎదురుగా ఒక నిండు విగ్రహరూపితుడైన వ్యక్తి

ఆ కళ్ళు నాకు బాగా తెలిసిన కళ్ళు
ఆ కళ్ళు ….నా మూగ ఊసులన్ని పంచుకున్న కళ్ళు
 
నేనెక్కడైనా ఉన్నానేమొ అని ఆ కంటి లోగిలో మెల్లెగా ప్రవేశించా…. బాహ్య ప్రపంచపు గదులన్ని దాటుకుంటూ వెళ్ళా 
 
…ఆ కనిపించింది……ఏ మలినం లేనిది…..తన అందమైన శరీరమనే తాలూకు పరదాను పక్కకు తోసేసి,జీవితాన్ని తనదైన తీరులో మలచుకున్నది  
 
“ఇంకా గుర్తున్నానా మాష్టారు.?”
“పదమ్మా ఇంటికి వెళ్దాం…”
“ఎవరింటికి మాష్టారు ?”
“అమ్మా…నీ కొడుకు కలెక్టరీ పాసయ్యాడు,అక్కడికే వెళ్దాం పదమ్మా,నిన్ను తీసుకువస్తానని మాటిచ్చాను ”
“అంత ఆశలేదు మాష్టారు,ఈ కట్టె పుచ్చి పోయిందని తెలిసినా,ఇనాళ్ళు భద్రం గా దాచుకున్న ఈ ఆశ్రమం లోనే కాలనీయండి..”
 
“అంత మాట అనకమ్మా…నీ మనసు మలినం లేని మేలిమి బంగారం…ఆ పాత ఙ్ఞాపకపు ఛాయలు గుర్తుండకూడదనే కదమ్మా నీకు ‘కాంచన ‘ అని పెట్టింది ”
 
“మర్చిపోవాలన్నా మర్వనివ్వనివి మాష్టారు అవి…”

ఒక్క నిమిషం ,ఇప్పుడే వస్తాను

“ఈ వీలునామా అబ్బాయికి అందివ్వండి …”

నేను వీలు నామా రాయడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా ? 
 
ఉంది మాష్టారు నేనూ వారసత్వం గా ఇవ్వాల్సినది.మొన్న పేపరు లో చదివాను,అబ్బాయి రామాపురానికే కలెక్టరీగా వెళ్తున్నాడు అని.

ఈ కాగితం గుర్తుందా మాష్టారు ?
పాతికేళ్ళ క్రిందట మీ దగ్గర తీసుకున్నది
గుర్తున్నదా  ఆ రోజు……..

*******************************************************

“…ఏమిటే నిన్న రాత్రి వచ్చిన వాడిని పదో పరకో అడగకుండా పట్నం నుంచీ బొమ్మల పుస్తకం తెమ్మాన్నావా ?
నీకు ఈ కొత్త మాయరోగం ఎప్పుడు పుట్టిందే  ? ”

” అమ్మా….నేను సదువుకుంటానే ….”

“సదువా….అదేందే….హాయిగా ‘పడుకుని సంపాదించమంటే…..సదువుకుంటా అంటావేందే… ..?”  
ఈ కొత్త పిచ్చి పట్టుకున్నందుకా నిన్న వచ్చిన గిరాకీని బొమ్మల పుస్తకం తెమ్మన్నావ్ ….ముదనష్టపు దానా…ఈ రోజు కడుపుకి లేకుండా జేసినావ్…….”

“….శివాలయం లో గోవిందయ్య మాష్టారు అందరికీ సదువు సెప్తున్నాడట ,ఈ రాత్రికి ఆడికోతానే… ”

“అమ్మా,తల్లీ  అని నిదానం గా సెప్తుంటే మాటవినవేందే….లేచి త్వరగా నలుగు పెట్టి స్నానం సెయ్యి,రాత్రి పక్క ఊరి ఎం ఎల్ యె వస్తున్నాడు…ఎక్కువ గిట్టుబాటు అవుతుంది……”

“నేను ఎల్లనే ఆడిదగ్గరికి….”

***************************************************

శరీరం మీద ఏదో పాకుతున్న భావన,చీడపురుగే…సందేహం లేదు …
ఎదురుగా తెల్లని చొక్కా జేబులో మెరుస్తూ కనిపిస్తోంది పెన్ను…

రామాపురం మా గ్రామం.దాదాపు 20 కుటుంబాలందరికీ ఇదే కుల వృత్తి.గిట్టుబాటు అయ్యే పదో పదిహేనుకి నిత్యం నలిగి పోయేది ఎన్నో కలలుగనే శరీరాల మాటున దాగున్న మా మనసులు.
ఇదే జీవితం అని ఆనందం వెదుక్కుంటూ అంకితభావం చూపించే వారు కొందరైతే,దీనినుంచీ బయట పడాలి అని ప్రయత్నం చేసి విఫలమైన వారు కొందరు,పారిపోయి కొత్త జీవితం మొదలు పెట్టాలి అని నిత్య ఆశావాదులు ఇంకొందరు.
 
వీరందరినీ ఏదో ఒక రోజు మారుస్తా అని నడుం కట్టిన గోవిందయ్య మాష్టారు లాంటి వారు ఇంకొందరు .మాష్టారు అంటే నాకు ఏదో తెలియని అభిమానం.సుఖనారీమణుల మధ్య శుకుడి లా ఉండే మాష్టారు ఏమీ కానీ మా కోసం అంత తపన పడడం చూసినప్పుడల్లా నాలో ఏదో ఆశాజ్యోతి వెలిగేది
ఈ రొంపి నుంచీ బయటపడి నేనుగా బ్రతగలను అన్న ఆశ.

“అటేందే సూస్తున్నావ్,నన్ను సూడవే ” అన్న పిలుపుతో ఉలిక్కి పడ్డా

“తు నీ యబ్బా……..ఇదిగో నీ 20……” 

“ఈ డబ్బు బదులు ఆ పెన్ను ఇవ్వండయ్యా…….?”

“.దానికి ఇంకో మారు నాకాడికి రావాలా,వస్తావా ? ”

చేతిలో నిగనిగ లాడే కొత్త పేనా.దీనితో ఏదేదో రాసెయ్యాలి.రాసేసి,సదివేసి ఏదేదో అవ్వాలి.మాష్టారీ సదవాలి.సదివి లక్ష్మిని ఇక్కడినున్సీ తీసుకెల్లాలి.తీసుకెల్లి ఇంకా ఇంకా సదివించాలి.పాపం పిచ్చిది,మూలకూసున్న మూడవనాటి నుచే దీనిలో……

“తూ యాడ ఆలోసితున్నావే ……మనసంతా పాడుసేసినావే…నీ యమ్మ నువ్వేదో అని 100 ముందే గుంజి నాది….తు మీ బతుకు…..”  
 
నిజమే….ఇదీ ఒక బతుకేనా…..ఎందుకో తెలియని బతుకు,నాకు నేను పనికి రాని బతుకు.
ఒక నాడు  తెల్లవారు ఝామునే మాష్టారు ,తెల్లటి చొక్కా లో ,తెల్లని సుద్దముక్కతో, అంతకన్నా తెల్లనైన మనసుతో మాష్టారు వెళ్తుండడం చూసి ధైర్యం చేసి నా మనసులోని మాట చెప్పాను.తెల్ల కాగితం ఒకటి చేతికి ఇచ్చి నీకు ఎంతవరకు రాయడం వచ్చో చూపించు అన్నారు.

ఇంతకాలం బొమ్మల పుస్తకాలలోరహస్యం గా రాసుకున్న నాకు ఆ తెల్లకాగితపు స్పర్శ కొత్త ధైర్యాన్ని ఇచ్చింది
 
“ఈ నరకం నుంచీ విముక్తి పొందాలి అంటే ఏమి రాయాలి ??” అని గద్గద స్వరం తో నాకు తెలియకుండానే పలికేసాను
 

“అయితే ఈ రాత్రికే నీ ప్రయాణం,శివాలయం దగ్గర 1  కి ”
చేతిలో తెల్లని కాగితం.మొదటి సారి స్వేచ్చగా గడపడాటుతున్న ఆనందం.ఆఖరు మాట కాగితం మీద రాద్దామనుకున్నా.

” …ఎవరికి రాయాలి? జాగ్రత్త తీసుకోనందుకు ప్రతిఫలం గా 9 నెలలు నన్ను మోసిన తల్లికా?
కొత్తగా డబ్బు సంపాదించే మార్గం దొరికిందని తండ్రి అవతారం ఎత్తి,నన్ను వ్యాపారం చేసిన తండ్రికా ? ఈ కాగితపు విలువ తెలియను వాళ్ళకు రాయడం కూడా వృధా…….”  అనుకుని కాగితాన్ని జాగ్రత్తగా పెట్టెలో  దాచుకున్నా.
  
మాష్టారి సహాయం తో ఒక ఆశ్రమం లో కొత్త జీవితాన్ని ప్రారంభించాను .పచ్చని చెట్లు,కడుపునిండా భోజనం,కావలిసినన్ని పుస్తకాలు.

నా మనసుకి సంబంధం లేకుండా కలిగిన విషబీజాన్ని మాష్టారే చదివిస్తానని తీసుకెళ్ళారు.నా వంతుగా కాగితాన్ని తీసి ఏదేదో రాసి వాడి చేటిలో పెడదామని  ఆశ.

“అయినా ఏమి రాయాలి,జీవితం లో ఏమి సాధించానని రాయాలి,నా నీడ ను కాగితం రూపం లో అందించి  బంగారు భవిష్యత్తుకి చీకటి క్రీనీడను అందించను….”  అని మళ్ళీ కాగితాన్ని భద్రపరిచాను

*************************************

“వీలునామా అని తెల్ల కాగితం ఇస్తున్నానేమిటి అని చూస్తున్నారా మాష్టారు? ”

ఈ కాగితానికి నా జీవితంలోని ప్రతి మలుపు తెలుసు మాష్టారు,తెల్లగా కనిపించినా ఎన్నో వర్ణాల ఊసులని మూగగా తనలో లీనం చేసుకున్నది.నా చీకటి జీవితాన్ని రహస్యం గా తనలో పొదిగిపెట్టుకున్నది. 

నా కోరిక ఒకటే మాష్టారు..ఆ రామాపురం లో అందమైన జీవితపు ఇంద్రధనస్సు చూడని బ్రతుకులెన్నో.వారి కోసం తనవంతుగా ఏదైనా చేసి,నా లాంటి తెల్ల కాగితాల మీద అందమైన బొమ్మను వెయ్యమనే …..

నా జీవితానికి ఇన్నాళ్ళకు సార్ధకత వచ్చింది అని తృప్తి గా నవ్వుతూ మాష్టారి జేబులోంచి వీడుకోలు చెప్తోంది “తెల్ల కాగితం ”  
 
   
 
 
   
 
 
 
 
  
 
  
 

Published in: on మార్చి 15, 2008 at 12:10 ఉద.  15 వ్యాఖ్యలు  

Average Days…..Happy days

చాలా కాలానికి సినిమా చూసాను.విచిత్రం ఏంటీ అంటే ఆ దర్శకుడి తదుపరి చిత్రం విడుదలకు ముందే నేను చూడడం ఇక విషయానికి వస్తే…హాపీ డేస్
ఆనంద్,గోదావరి చిత్రాలు చూసి,మనసు పడి శేఖర్ చిత్రాల మీద కొన్ని అంచనాలు ఏర్పరచుకున్నాను.
నా అత్యాశో,లేక ఆ చిత్రం తీసినతీరో తెలియదు ఈ చిత్రం ఎందుకో నన్ను నిరాశ పరిచింది

చిత్రానికి ముందు విడుదల అయిన  పాటలు విని చక్కని,చిక్కని సాహిత్యం కోసం వెదికాను,ఇక సరే కాలేజీ నేపధ్యం ఉన్న చిత్రం కదా అని సరిపెట్టుకున్నాను

ఇక సినిమా సంగతికి వస్తె……ఇంజనీరింగు మొదటి  సంవత్సరం తో మొదటి భాగం మొత్తం సాగింది(బాగా సాగతీసాడు శేఖర్) .
 
మొదటి రోజు కాలేజీ అనుభావలని చక్కగానే చూపించాడు.కొత్త కొత్త స్నేహాలు,ఇంజనీరింగు చేరామనే గర్వం,సీనియర్ల తో చిన్న చిన్న గొడవలు,మొదటి సారి అమ్మయి తాకిన అనుభూతి, మొదటి ప్రేమకోసం తపించడం,అప్పుడు కలిగే ఆకర్షణ,అందమైన టీచరు మీద కలిగే చిలిపి భావనా వంటివి.ఇంటర్వెల్ కి ముందు మాత్రం హడావుడిగా మొదటి సంవత్సరాన్ని పరీక్షలు రాసేసాం అని ఒక్క ముక్కలో చెప్పి ముగించాడు.
వాస్తవం లో కూడ మొదటి సంవత్సరం రాగింగ్ హడావుడితో త్వరగానే ముగుస్తుంది.
 
ఇక రెండో భాగం మొత్తం అంతా తమ తమ అమ్మాయిలను పొందడమే పరమావధిగా సాగింది.

అందులో భాగం గా కొన్ని ఇబ్బందికర సన్నివేశలు కనిపించాయి. 
వాస్తవం లో అలాంటివి జరిగినా,ఇలాంటి శక్తి వంతమైన మాధ్యమాల ద్వార చూపించేముందు దర్శకులు ఆలోచించాలి

గొదావరి,ఆనంద్ వంటి “క్లీన్” చిత్రాలను తీసిన కమ్ముల చిత్రాలలో ఇలాంటి సన్నివేశలు చూసి ఇబ్బంది కలిగించింది

చిత్రం లో మిక్కీ మేయర్ సంగీతం బాగుంది.బాక్ గ్రౌండ్  కూడా బాగుంది

సినిమా లో ఆఖరున తప్ప,ఎక్కడా “కెరీర్” గురించి ధ్యాస కనిపించదు.ఇంజనీరింగు భాగం లో ముఖ్యమైన “ప్రాజెక్ట్” మరిచాడేమో!!

అఖరున “ఉద్యోగాలు” ఇప్పించక పోతే బాగోదు అనుకుని,”విప్రో” వాళ్ళని పిలిపించారు.

ప్రేమ వగైరా సన్ని వేశాలను నిశితం గా చూపించిన శేఖర్,అంతే ఇదిగా పాఠాల పట్ల,భవిష్యత్తు పట్ల అంకితభావాన్ని చూపించి ఉంటే  యువతకి చక్కటి మార్గదర్శకం గా ఉంటుంది
సినిమా అన్నది కేవలం వినోదం కోసమే కాదు,సామాజిక స్పృహ ఉంటే కళ యొక్క ముఖ్య ఉద్దేశ్యం నెరవేరి నట్లే…….
 

ఒక్క ముక్కలో చెప్పాలంటే “కొత్త సీసాలో పాత సారాయి” చందం గా అనిపించింది.

Published in: on నవంబర్ 11, 2007 at 5:25 సా.  10 వ్యాఖ్యలు  

బతకమ్మ బతకమ్మ ఉయ్యాల

అసలు నా బతుకు ఎలా అయ్యిందంటే నవరాతృలు వచ్చినా,పూర్తి అవుతున్నా నా అంతః,బాహ్య ప్రపంచకాలలో  మార్పేమి రాలేదు.

అదే 3వ నంబరు బస్సు,అదే కండక్టరు బాబాయి,అదే కాలేజీ,అదే పక్క బెంచి పావని,అదే లూసు షర్టు హనుమంతరావు సారు.

నేను నిద్ర లేవక ముందే మా ఇంట్లో ఏవో పూజల పేరిట దేవుడి ఊపిరి తీసేపనిముగించేస్తారు కాబట్టి ,నా వ్యక్తిగత జీవితానిలోనూ పెను తుఫాను ఏమీ లేదు.
 
మనం ఇలా ఉన్నాం,పక్క వాళ్ళెలా పండగ చేసుకుంటున్నారో అని పావని కి ఫోను చేసాను
ఎలా చేసుకుంటున్నావే పండగ అంటే..”ఏముందే ఈటీవీ సుమన్ కి అవార్డుల షాపు ఇచ్చేసారు,ఏది కావాలో తీసుకొ అని,మా టీ వీ లో “అస్కో బుస్కో కాస్కో……..దమ్ముంటే చూస్కో” సినిమా ,ఇక టీ వీ 9 లో పండగ రోజు చిరంజీవి అల్లుడి మీద ప్రత్యేక వార్తా  కధనం” అంటూ అన్ని చానళ్ళ పట్టిక చెప్పేసింది.

ఇలా కాదని  మా సన్నీ గాడికి ఫోను చేసాను.వాడినీ అడిగాను పండగకు ఏమి చేస్తున్నావు రా అని.వాడు 3 సినిమాలు,6 పార్టీలు,12 కేకు కటింగులు అని చెప్పాడు.

దేవుడా  అని ఒక నిట్టూర్పూ సట్టూర్పు వదులుతున్న తరుణం లో దూరం గా మైకు లో “బతకమ్మ బతకమ్మ ఉయ్యాల….” అన్న పాట వినిపించింది.

   
అసలు ఎవరీ బతకమ్మా,ఆమెకు ఉయ్యాల ఏంటి,ఆమెకు ఉయ్యాల ఊగేంత తీరిక ఏలా ఉంది,ఆమె ఆర్కుట్ లో లేదా అని బోలెడు ధర్మ సందేహాలు నాకు వచ్చేసాయి  
 ఈ పాట నాకేంటి తెగ అర్థమై పోతోంది,తెలుగు పాట కాదేమో అని ఆ పాట వైపుగా పయనం సాగించా. 
 
రాజీవ్,ఇందిరమ్మ ల గుడిగా ఇంకా రూపాంతరం చెందని “శివాలయం ” అది
విశాలమైన ప్రాంగణం.
వేప,రావి,నేరేడు చెట్లతో చల్లగా ఉంది.
“ఆమ్మవారు దుర్గాదేవి అలంకారం లో విరాజిల్లుతున్నారు,భక్తులు దర్శనం చేసుకోగలరు” అని మైకు లో చెప్తున్నారు
 
నా అడుగులు తమంతట తామే గుడిలో ప్రవేశించాయి.దివ్య మంగళ హారితి వెలుగులో అమ్మ నిండుగా కనిపిస్తోంది.పెద్ద కళ్ళు,దీపాల వెలుగులకి పోటీగా మెరిసే ముక్కెర,ఎర్రటి చీర.

అంతలో పూల పళ్ళాలతో ఆలయం లో కొందరు ముత్తైదువులు  ప్రవేశించారు. 
ఆ పూల గుత్తే “బతకమ్మ”
తమ శక్తి ని బట్టీ ఒక్కొక్కరు రకరకాల పూలను గుండ్రం గా ఒక పళ్ళెం లో అలంకరించారు
ఆ గుత్తి మీద పసుపుతో చిన్న ఆకృతి పెట్టారు

మెల్లెగా ఆడవాళ్ళ రాక పెరిగింది.వాటితో పాటే ఈ బతకమ్మలునూ.ఒక చోట అంతా దగ్గర చేర్చి చుట్టు మూగారు.దాని చుట్టు చపట్లు కొట్టుకుంటూ తిరుగుతూ పాటలు పాడారు

చీకటి పడడం తో ఈ బతకమ్మలను దగ్గరలోని చిన్న కొలనులో వదిలారు.బతకమ్మ మీద చిన్న దీపం నీళ్ళల్లో అందం గా ఊగుతూ ముందుకు సాగడం ఎంతో అందం గా ఉంది
 
కొంతమంది ప్రసాదం గా అటుకులూ,బెల్లం ఇచ్చారు.
ఇంకొందరు 9 రకాల పిండ్లను నెయ్యి తో కలిపిన మిశ్రమాన్ని పంచారు.

ప్రకృతి ఆరాధనకు నిదర్శనం ఈ  బతకమ్మ.నవరాత్రులు మొదలుకుని,అష్టమి వరకు ప్రతి రోజూ బతకమ్మ ని తయారు చేసి నీళ్ళల్లో వదలడం తెలంగాణ ప్రజల ఆచారం.

పార్వతీ దేవి స్వరూపం గా ఈ బతకమ్మను భావించి కన్నె పిల్లల దగ్గర నుంచీ ,పండు ముత్తైదువుల వరకు ఈ పండుగను సామూహికం గా జరుపుకుంటారు

తెలంగాణ యాస లో సాగే ఈ బతకమ్మ పాటల అంతరార్ధం “సర్వేజనా సుఖినోభవంతు” 
 
ఇంటికి రాగనే ఎదురుగా లైబ్రరీ నుంచీ తెచ్చుకున్న The concept of Socialisation and Inter personnel skills by Stephen.P.Robbins నవ్వుతూ దర్శనమిచ్చింది

బతకమ్మ బతకమ్మ ఉయ్యాలా అని నవ్వుతూ ఈ పుస్తకాన్ని పావనికి బేరానికి పెట్టేసాను

Published in: on అక్టోబర్ 20, 2007 at 5:43 ఉద.  3 వ్యాఖ్యలు  

మన తెలుగు సినిమా పయనం ఎటు?

ఇదే విషయం నేను గత కొంత కాలం గా ఆలొచిస్తున్నా,బ్లాగు రాసేంతగా చేసింది నిన్న నేను చూసిన ఇంటార్వ్యు.
అసలు కథ పట్ల మన దర్శకులకు ఎంత అభిమానం ఉందో అది చూస్తే అర్ధం అవుతుంది .
అసలు ఈ మధ్య సినిమాల్లో కథ నిజం గా ఉంటోందా?
ఈ ప్రశ్నకు ఠక్కున లేదు అనే జవాబే చాలా నోట్ల విన్నాను.
నాకో చెడ్డ అలవాటు.ఎవరు సినిమా చూసా అని చెప్పినా,వెంటనే కథ చెప్పు అని ప్రాణం తీస్తా.
ఈ మధ్య ఈ అలవాటుకి కాస్త విరామమం వచ్చింది.సినిమా  చూసిన వాడెవడూ కథ ఏంటో చెప్పట్లేదు
మామూలు మాటల్లో చెప్పలేని దృశ్య కావ్యం ఏమో అని నేను కొన్ని సినిమాలు లేటుగా చూసాను
నాకు ఆ భావమే కలిగింది.
ఇలా బ్లాగులో నేను చూసిన సినిమా గురించి రాయాలంటే నాకు మాటలు దొరకలేదు.
సరే నా తెలుగు పాండిత్యం ఇంతవరకే అనుకుని తృప్తి చెందాను.
ఇలా నన్ను నేను ఎన్నో సార్లు సమధాన పరచుకున్నా,నిన్న నేను చూసిన కార్యక్రమం ఇలా బ్లాగేంతవరకు నిద్ర పోన్నివ్వలేదు. 
ఈ మధ్య అంతా ‘చిరు’  తనయుడు  పేర విడుదల అయిన  చిరుత.
అలా టి వీ తిప్పుతుంటే పూరి జగనాథ్ కనిపించాడు.అంతా ఆ సినిమా క్లాసులో మాట్లాడుతున్నారు ,నేను ఈ కార్యక్రమం చూసి,సినిమ చూసా అని పోసు కొడదాం అని అనుకున్నా.

సరే వాణిజ్య ప్రకటనల విరామాల్లో పూరి మాట్లాడాడు.పాపం ఈ ఆంకరు ఈ సినిమ  కథ తమ ప్రేక్షకులకు చెప్పిద్దాం అని అడిగిన ప్రశ్ననే రక రకాలు గా అడిగినా పూరి ఒకటే జవాబు చెప్పాడు.
ఈ సినిమాలో కథ ఎమీ లేదు అని,కేవలం మెగాస్టార్ తనయుడిని పరిశ్రమకు పరిచయం చెయ్యడం కోసమే ఈ సినిమ తీసానని,కథని పెద్దగా పట్టించుకోలేదని చెప్పడం నాకు భలే ఆశ్చర్యం వేసింది.

నేను సరిగ్గా వినలేదేమో అని ఆ కార్యక్రమం ఆసాంతం చూసాను.మళ్ళీ అదే చెప్పాడు

ఇక ఏం అనాలీ
కథ నటుడి కోసమా?
నటుడు కథ కోసమా?

మన సినిమాలు ఎందుకు అంతర్జాతీయం గా గుర్తింపు పొందట్లేదు అనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనం

ఎవరో కొడుకుని పరిచెయ్యడం కోసం ఇష్టం వచ్చినట్టు ఒక్కో సినిమా నుంచీ కాస్త కాస్త తెచ్చి అతికించడమేనా?

ఒక గొప్ప నటుడి కొడుకు/మనవడు అని అచ్చేసి జనాల మీద కి తొసేస్తె  చాలా?
వారికంటూ ఒక సొంత గుర్తింపు అక్కరలేదా?
అసలు నటించడానికి వారికున్న కనీస అర్హత ఏంటి?
రంగస్థల అనుభవం ఉండాలని ఆశించడం అత్యాశే గాని,కనీసం నటనకు సంబంధిత శిక్షణ ఎంత వరకు  తీసుకున్నారు?
ఏదో గెంతడం,కొట్టడం నేర్చుకున్నంత మాత్రానా హావభావాలను పలికించే అవసరం వారికి లేదా?

 అసలు నటన ఎదో వారసత్వం కొనసాగింపుకా లేక నిజం గా ఈ కళ పట్ల వారికి అంకిత భావం ఉందా?
 

సినిమా అన్నది దృశ్య కావ్యం గా ఎంత మంది దర్శకులు భావిస్తున్నారు
ఒకప్పుడు సినిమా ఒక భాషలో తీస్తున్నారు అంటే ఆ భాష మీద మంచి పట్టు ఉండేది.
అందుకే అప్పటి సినిమాల్లో సంభాషణలు ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటున్నాం,సమయోచితం గా వాడతాం.
మరి ఇప్పుడు సంభాషణలు రాసేవారికి నిజం గా తెలుగు భాష మీద అంత పట్టు ఉందా?

మా బామ్మకి హిందీ రాకున్నా అప్పట్లో “నవ్ రంగ్ ” సినిమాకు బండి కట్టుకు వెళ్ళిందట.ఇప్పటికీ నేను అడుగుతా మా బామ్మని నీకు ఆ సినిమా ఏం అర్ధం అయ్యింది అని.తను చెప్పే సమధానం ఒక్కటే అక్కడ తెర మీద చేసే వారి ముఖం లో ఎం జరుగుతోందో అర్ధం అవుతుంది కదా,ఇక భాషతో అవసరం ఏంటి అని.  

మరి ఇప్పట నటీనటులు అంత చక్కగా హావభావాలు పలికించగలరా?

అసలు నటీనటుల నుంచీ నిజం గా ఈ దర్శకులు నటనను రాబడుతున్నారా?

అసలు దర్శకులుగా పరిచయ్యం అయ్యేవారికి అన్ని విభాగల మీద పట్టు ఉందా?

ఎంతసేపటికీ పరభాషా చిత్రాల నుండి కథను అరువు తెచ్చుకోవడమే తప్ప నిజం గా మనకు కథలు లేవా?

మన పురాణ కథలనే ఇప్పటికాలానికి అణుగుణం గా ఎందుకు మలచరు?

ఇక్కడ మన తెలుగు పాటలు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది

డాక్తర్ చక్రవర్తి చిత్రం లో “ఓ ఉంగలారల ముంగురులున్న రాజా” అన్న జానపద గీతం లో “తస్సదియ్య” అన్న పదానికి సెన్సారు వారు అభ్యంతరం చెప్పారట.
మరి నేడు?
 
అసలు మన తెలుగు సినిమ అంతార్జాతీయ(కనీసం జాతీయ)స్థాయి పురస్కారం పొంది ఎన్ని ఏళ్ళు అయ్యిందో …

జాతీయ పురస్కారం పొందినా అవి నిజం గా అంత విలువ చేస్తాయా అన్న అనుమానం ప్రతి ఒక్కడికీ కలుగుతుంది

తెలుగు సినిమాకు మహర్దశ రావాలంటే ఈ వారసత్వ నటులు పోయి ఈ కళ పట్ల అంకితభావం ఉన్న వాళ్ళు ,భాష మీద పట్టు ఉన్న వాళ్ళు రావాలి.

ప్రభుత్వం తరపున మంచి కళాత్మక సినిమాలకు రాయతీలు కలిపించి అలాంటివి తీసేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి.

పైరవీలు లేని జాతీయ పురస్కారాలు,అంగాంగ ప్రదర్శననని అనుమతించని సెన్సారు బోర్డు వంటి కనీస చర్యలు తీసుకున్నప్పుడే తెలుగు సిని తల్లి పట్టు బట్ట కడుతుంది

Published in: on అక్టోబర్ 6, 2007 at 12:48 సా.  18 వ్యాఖ్యలు  

నేడు గురజాడ జయంతి

ఈ పేరు వినగానె చటుక్కున గుర్తొచ్చేది “కన్యాశుల్కం”
బాల్య వివాహల పై,వితంతు పునర్వివాహలపై ఆ నాటిక ఒక చంప పెట్టు

ఆద్యంతమూ చమక్కులతో ఆ నాటి సాంఘిక పరిస్థితులకు అద్దం పట్టే నాటిక అది.

ఆ నాటిక తెచిన మార్పు అంతా ఇంతా కాదు
 

“దిద్దుబాటు ” అని మార్పులు తెచ్చినా “చుట్ట తాగని వాడు దున్న పోతై పుట్టు ” అంటు సున్నిత హాస్యం తో కూడిన పద్యం చెప్పినా,”young beautiful,unfortunate widow ” అని బుచ్చమ్మను (ఆ నాటి స్త్రీ) ని పొగిడినా,”కన్యక” పేరు తో కన్నీళ్ళు తెప్పించినా,”యే దేశ మేగినా,ఎందుకాలెడినా” అంటూ దేశ భక్తిని రగిల్చినా గురజాడ వారికే చెల్లు

మన దురదృష్టం మూలానా ఈ రోజు ఆయన మీద ఒక్క వ్యాసామే కనిపించింది

Published in: on సెప్టెంబర్ 21, 2007 at 3:53 ఉద.  6 వ్యాఖ్యలు  

జీ టీ వీ “స రి గ మ ప”….సుస్వరాల హంగామ

నిన్న ఆదివారం తో చిన్న పిల్లల అధ్యాయం ముగిసింది.
ఏంటో ప్రతి గురు,శుక్ర వారాలు ఈ కార్యక్రం కోసం ఎదురు చూడడం అలవాటు అయ్యింది.
ఒక్క సారిగా ఇంత అభిమానాన్ని చూరగొన్న  ఈ కూనలు  మళ్ళీ పాడరు అన్న విషయం జీర్ణించుకోవడానికి కాస్త సమయం పట్టేలా ఉంది..అద్రుష్టవశాత్తు బాలు గారి “పాడలని ఉంది” వెనువెంటనే చిన్న పిల్లల అధ్యాయం మొదలు పెట్టడం  ఈ రత్నాలకు మర్రిన్ని మెరుగులు దిద్దడమే !

కారుణ్య పర్యవేక్షణనుంచీ బాలుగారీ పర్యవేషణకు మారడం ఈ పిల్లల పూర్వ జన్మ సుకృతమే!
 
ఈ కార్యక్రమం మొదలైన దగ్గరినుంచీ ప్రతి ఆధ్యాయం చూస్తున్నా.వాళ్ళను కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో అని ప్రతి సారీ అనుకున్నా.

బడిలో ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్న వీరు అంత పెద్ద పాటలని మర్చిపోకుండా అంత మంది ముందు పాడడం చూసి  ఆశ్చర్యం వేసింది.

 ఈ సారి ముందు నిలచిన సాయి దేవ హర్ష పాటవింటే అందరికీ ఇదే అనిపిస్తుంది.8 ఏళ్ళ చిన్ని బాబు,ఎక్కడా శృతి తప్పకుండా,పెద్ద పెద్ద సమాసాలను,పద్యాలను చేతిని తిప్పుతూ పాడాడు.

రెండో స్థానం లో నిలచిన “భువన కృతి”,ఆ తరువాతి స్థానాలలో ఉన్న”శరత్ సంతోష్” “అనిరుధ్”,”సత్య యామిని” మొదలైన వారు ఎదో చిన్న తప్పులు చేసి వెళ్ళారు తప్ప,అంతా మొదటి స్థానానికి పూర్తి అర్హత గల వారే.

ముఖ్యం గా నాకు అందరి కన్నా “అనిరుధ్” తెగ నచ్చేశాడు.
సాధారణం గా పోటీ సంగీత కార్యక్రమాలలో ఎవరూ పాడని “జయభేరి” చిత్రం లోని “రసి క రాజ తగువారము కాదా..ఏలు దొరవు అరమరికలు లేక..” అన్న పాట ఈ  అబ్బాయి పాడిన తీరు నన్ను ఈ అబ్బాయి అభిమానిగా మార్చేసింది.
ఈ పాట సంగీతం తో నిష్ణాతులకు తప్ప అన్యులకు కొరగాదు.అలాంటి పాటను ఈ అబ్బాయి  ఒక్క గమకం కూడా వదలకుండా,ఎక్కడా పక్కకు పోకుండా పాడడం నిజంగా చాలా  చాలా great

చాలా రోజులు నుంచీ నేను మన పాత పాటలు నేటి తరానికి అందవేమో అనుకున్నాను.ఈ కార్యక్రమం చూసాక ఆ భయం పోయింది.ఎన్నో మరుగున దాగిన ఆణిముత్యాలు వెలుగులోకి వచ్చాయి. 

ఇంకా ఆనందించదగ్గ విషయం ఏంటి అంటే…దీనిని నడిపిస్తున్న “కారుణ్య” చక్కగా తెలుగులో మాట్లాడడం.కార్యక్రమం మొదట్లో “కారుణ్య”వాడిన  తెలుగు సొబగులు,కార్యక్రమం మీద ఆశక్తి రేపింది.న్యాయనిర్ణేతలుగా వచ్చిన ‘కోటి”,”శైలజ”,రమణ గోగుల” తమ పాత్రలని చక్కగా నిర్వహించారు.

పంటికింద రాయిలా ఈ కార్యక్రమం ఆఖరి భాగం గా అనిపించింది.అంత హంగామా,మధ్యలో దేవి శ్రీ ప్రసాద్ పిచ్చి గెంతుళ్ళు ఎబ్బేట్టు గా అనిపించింది.
లేత మనసులకి అంత బహుమతులు ఇవ్వడం వల్ల దాని ప్రభావం తీవ్రం గా ఉంటుందేమో.మొదటి ముగ్గురికీ 50వేలకు పైగా ఇస్తూ,అంతే స్థాయి లో పాడిన మొదటి 5 వారికి ఏమీ ఇవ్వక పోవడం కాస్తంత బాధ గా అనిపించింది.

దీన్లో మొదటి 10 మందికి స్తేజి మీద,అందరి ముందూ ఇస్తే ఎంతో ప్రోత్సాహకరం గా ఉండేది.

అంత హంగామా మధ్య ఈ కార్యక్రమాన్ని జరిపేబదులు simple గా చేసి ఉంటే బాగుండేదేమో.కార్యక్రమం ఆద్యంతమూ sponsors  వల్ల నడుస్తుండడం వల్ల అడ్డు చెప్పలేం.

SMS పద్దతి కాకుండా నిష్ణాతులైన వారిని న్యాయ నిర్ణేతలుగా నియమించి ఉంటే బాగుండేదేమో.

వ్యక్తిగతం గా నేను సాయి దేవ హర్షకు మొదటి స్థానం రావడం అంగీకరించను

ఆ అబ్బాయి అంత చిన్న వయసులో కలిగిన గ్రహణ శక్తి నిర్వివాదశం

తను పాడిన పాటల్లో శాస్త్రీయ సంగీతం పాలు తక్కువ
 
శాస్త్రీయ సంగీతం లో మంచి పట్టు కలిగింది తరువాతి స్థానం లో ఉన్న శరత్,అనిరుధ్,భువన.

అనిరుధ్ ముఖం లో భయం ప్రస్పుటం గా ప్రతి సారీ కనిపించింది
అది తగ్గించుకుంటే భవిష్యత్తులో మంచి గాయకుడు అవ్వగలడు  

గెలుపూ ఓటములు పక్క పెడితే ప్రతి ఒక్కరి గళం ఈ పోటీ వల్ల చాలా మెరుగులు దిద్దింది అన్నది మాత్రం నిజం

ఇలాంటి కార్యక్రామల కోసం  అయినా నేటి తరం శాస్త్రీయ సంగీతం వైపు దృష్టి సారిస్తుందేమో!

ప్రతి భాగం లో పిల్లల కల్మషం లేని మనసు ప్రస్పుటం గా కనిపించింది.తమ మధ్య ఇంత వరకు పాడిన స్నేహితుడు వెళ్ళి పోవడం చూసి ఆ పసి మనసులు కన్నీళ్ళు పెట్టుకోడం చూసి నా కన్నీళ్ళూ ఆగలేదు. అందుకే కదా పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు.మనం పెరిగే కొద్దీ ఆ కల్మషమే హరించుకుపోయి “పక్క వాడికంటే ముందు ఉండాలి” అన్న ఆలోచనతో మొదలయ్యి ఈర్ష్య ,ద్వేషం గా కొనసాగి “ఆఖరికి పక్కవాడిని ముంచే” స్థాయికి చేరుతుందేమో!!

  

Published in: on సెప్టెంబర్ 11, 2007 at 4:04 సా.  4 వ్యాఖ్యలు  

ఎటు పోతున్నాం మనం?

 చదివాక ఈ కిందదీ ఎంతో సముచితం అని భావించి టపా రాస్తున్నా

మా వీధి లో జరిగిన ఒక యధార్ధ సంఘటన మీ ముందు ఉంచుతున్నా

“మేము ఉంటున్నది రైల్వే కాలనీ.ఇళ్ళన్నీ పక్క పక్కనే.గోడలు ఇళ్ళకు మాత్రమే,మా మనసులకి కాదు.

రామారావు గారు,వారి భార్యకవిత ,3 పిల్లలు.కవిత గారిది చక్కటి రూపం.
వాళ్ళ ఎదురింటిలో వెంకటయ్య గారు.రిటైరు అయ్యారు.4 అబ్బాయిలు
రామా రావు గారు పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళడం తో,వెంకటయ్య గారింట్లోనే కవిత కు కాలక్షేపం
 
ఈ క్రమం లో వెంకటయ్య గారి ఆఖరి అబ్బాయి కళ్యాణ్ తో సీతకి స్నేహం ఏర్పడింది. కవిత పిల్లలు కళ్యాణ్ ని “మావయ్య” అని పిలిచే వారు.
రామారావు పని వత్తిడి వలన ఎక్కడికైనా తీసుకువెళ్ళక పోతే కళ్యాణ్ , కవిత ను తీసుకెళ్ళే వాడు 
క్రమం గా వీళ్ళ స్నేహం పెరిగింది.అది ఎంత వరకు వచ్చింది అంటే,రామరావు,కవిత సంసార విషయాలను సైతం ఈ కళ్యాణ్ తో చర్చిండం వరకు.

ఈ స్నేహన్ని ఆ వీధిలో ఒక్కొక్కరూ ఒక్కో పేరుతో పిలిచే వారు. 

లోకుల మాటలు ఎందుకు నిజం చెయ్యకూడదు అన్న ఆలొచన కవిత కు కలిగింది.అదే సమయం లో మా ఊరిలో చిరు ఉద్యోగం చేస్తున్నా కళ్యాణ్ కు తిరుపతి లో రావడం తో అక్కడికి కవిత , కళ్యాణ్ చేరుకున్నారు.”

రామారావు ఆ ఊళ్ళో ఉండలేక వేరే ఊరు బదిలీ అయ్యారు.ప్రస్తుతం కవిత 3 పిల్లలు  కవిత తండ్రి దగ్గర
పెరుగుతున్నారు.
 
దిగజారుతున్న విలువలకు సజీవ దృశ్యం ఈ సంఘటన.
ఎవరి దారి వారు చూసుకున్నారు.మధ్యలో బలి అయ్యింది పసి పిల్లలు
పెళ్ళై,చక్కగా సంసారం,చక్కని పిల్లలూ ఉండి కూడా తాత్కాలిక ఆకర్షణను,కా(లో)కుల మాటలకు ఊతం ఇచ్చింది కవిత . 
పెళ్ళి కాక ముందు ఏది చేసినా అది పూర్తిగా వ్యక్తిగతం.పెళ్ళయ్యాక చేస్తే అది ఆ ఇద్దరికీ సంబంధించినది.పిల్లలు కలిగాక చేస్తే అది ఒక సంపూర్ణ కుటుంబానికి చెందినది
కవిత దృష్యా తను చేసింది ఒప్పే కావచ్చు.

కానీ మధ్యలో తమ భవిష్యత్తును పణం గా పెట్టింది అభం శుభం తెలియని పిల్లలు

తమ మధ్య స్వచ్చమైన స్నేహాన్ని పది మందీ తప్పుగా అనుకొని ఉండచ్చు.అయినంత మాత్రాన అది నిజం ఎందుకు చెయ్యాకూడదు అనుకోవడం,అదే నిజం చేసి అందరి ఊహలను నిజం చెయ్యడం తప్పు
 

Published in: on సెప్టెంబర్ 4, 2007 at 11:28 ఉద.  2 వ్యాఖ్యలు  

చలం…’విషాదం’

ఆయన పేరే తెలుగు సాహిత్యం లో ఒక సంచలనం,ఒక వివాదం

ఆయన పుస్తకాలు చదవమని ఎన్ని చేతులు అందిచాయో,అన్నే చేతులు నన్ను అడ్డూ చెప్పాయి
ఆఖరికి “విషాదం” ఈ వారంతరం చదవగలిగాను
100పుటాల చిన్న పుస్తకం,అయినా ఆలోచింపచేసేది
 
ఈ పుస్తకం లో చలం విషయాలు స్పృశిస్తాడు.అవి:
పుణ్యం-పాపం,భయం,ద్వేషం-ఈర్ష్య,కామం,సెక్సు కంట్రోలు,హిందూ పతివ్రతలు,అన్యకాతలడ్డంబైన,ప్లేటోనిక్ లవ్,పత్రికలు చేసే అపచారం, కవిత్వం దేనికి,సినిమా జ్వరం,త్యాగం
 
ఒక్కో అంశం చదివాక నిజం గా రెండురకాల ఆలోచనలు కలుగుతాయి
చలం వాదన విన్నాక చాలా విషయాల్లో ఆయన ఆలోచనా విధానం  నన్ను ఆశ్చర్య పరిచింది
నేలవిడిచి సాము వద్దని,వాస్తవాన్ని గ్రహించి మనిషి గా బ్రతకమని చెప్పినట్టే అనిపిస్తుంది
కానీ ఇంకాస్త లోతుగా ఆయన వాదనని చూస్తే,నిజమైన ఆనందాన్ని తెలుసుకోలేదేమో చలం అని అనిపిస్తుంది
(ఈ పుస్తకం రచించేనాటికి)

“అన్యకాంతలడ్డంబైన” ఈ అంశం మీద ఆయన సుధీర్గ వ్యాసం ఒకింత విసుగు తెప్పించినా,ఆయన ఆలోచన తీరు నన్ను ఆలోచింపచేసింది
పోతన భాగవతం లో ప్రహ్లాదుని గుణాలను చెప్తూ..”అన్యకాంతలడ్డంబైమ మాతృభావన చేయు ” అన్న పద్యం ఉంది
ప్రహ్లాదుని వయసు 3 నుంచీ 10 వరకు ఉండవచ్చు.ఆ వయసులో అన్యకాంతలు,బాతృభావన చెయ్యడం ఏంటి అంటూ చలం   ప్రశ్నించాడు

దీనికి జవాబు:కవి-సామాజిక స్పృహ/భాధ్యత

ఈ విషాదం పుస్తకం మొత్తం చదివాక,చలం లో ఇదే లోపించిందేమో అని నాకు అనిపించింది
ఎవరూ చూడని స్వర్గం కోసం,ఎవరూ పొందని మోక్షం కోసం వెంపరలాడడం కంటే,మనిషిగా అన్ని సుఖాలను(శారీరిక   సుఖం) పూర్తిగా అనుభవించమని,ఇంద్రియ నిగ్రహం అక్కర లేదనీ చలం చాలా స్పష్టం గా చెప్పుకొస్తాడు.

ఇలా చెయ్యకుండా మోక్షం ,స్తితప్రఙ్ఞత ని “హిపోక్రసి” అంటాడు.తమని తాము మోసం చేసుకోవద్దంటాడు.

పుస్తకం మూసేసే ముందు చిన్న సందేహం……ఇన్ని చెప్పి,మన పూర్వులు చెప్పినదంతా ఈ కాలానికి వర్తించదు అని గట్టిగా నమ్మి ఆఖరికి రమణ మహర్షి ని ఆశ్రయించడం ఏంటీ అని??

శివగోవింద గోవిందా,హరి గోవింద గోవిందా అని పాడుకోవడం నా వంతు ఆయింది   
  
 
 

Published in: on ఆగస్ట్ 19, 2007 at 3:02 సా.  5 వ్యాఖ్యలు  

“హే రాం”-2

ఆయనో నినాదం,ఆయనో వివాదం

ప్రతి సంవత్సరం నోబెల్ బహుమత్తులో ప్రతి ఏట ఏ విభాగం గురించి ఆశపడక పొయినా,ప్రతి భారతీయుడు ఆయనకు రావాలని మనస్పూర్తిగా ప్రార్ధిస్తడు.రాక పోతే ఆ నోబెల్ బహుమత్తులో ఎదో రాజకీయం జరిగి ఉండి ఉంటుందని చూసినట్టు మల్లే వ్యాఖ్యానిస్తాం. 

ఆయన ఫోటోను ఇళ్ళల్లో దేవుడి పటాల పక్కన  పెట్టుకుంటాం

ఆయన మీద సినిమా వస్తే స్కూళ్ళకు శెలవు పెట్టించి మరీ పెద్దవాళ్ళు చూపిస్తారు.ఆయన మీద సినిమాకు ప్రభుత్వం ఏకం గా ఆర్ధిక సహాయం చేసేస్తుంది 
 
శాంతి కపోతం అనీ,ఈ శతాబ్దం లో అత్యంత ప్రభావితం చేసిన వాడని వేనోళ్ళా పూజిస్తాం

చీకటి కప్పేసిన వెలుగు ఆయన,ఆయన జీవిత చరిత్ర
ఆయనో వైరుధ్యం,ఆయనో వివాదం.
ఆయనో సిద్ధాంతం,ఆయనో వేదాంతం
(తెలిసేట్టు చెప్తే అది సిద్ధాంతం,అర్ధం కాకపోతే వేదాంతం)

ఆయనలో ఉండే మరో కోణన్ని వెలుగులోకి తెచ్చే చిన్న ప్రయత్నం ఈ వ్యాసం 

 http://www.andhrabhoomi.net/gandhi.html

Published in: on ఆగస్ట్ 19, 2007 at 6:13 ఉద.  2 వ్యాఖ్యలు